యువకుడిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

యువకుడిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : ఆమదాలవలస మున్సిపాలిటీలోని కొత్త కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్‌ అనే యువకుడిపై పీఐటీ ఎన్డీపీఎస్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టాన్సెస్‌) యాక్ట్‌ నమోదైంది. రాష్ట్ర రెవెన్యూ (ఎకై ్సజ్‌) శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ మేరకు ముందస్తు నిర్బంధ (సెక్షన్‌ 3(1)) ఉత్తర్వులు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి మంగళవారం జారీ చేశారు. జగదీష్‌ ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలకే కాక ఇతర జిల్లాల్లోని విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు ఎస్పీ తన విచారణలో తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో తక్షణమే విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య

మెళియాపుట్టి: భారత సైన్యంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ మరికొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చెంది కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన ఆర్మీ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మెళియాపుట్టి మండలంలో చోటుచేసుకుంది. చాపర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ నక్క నారాయణరావు(40) ఆదివారం జమ్మూకాశ్మీర్‌లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. నారాయణరావుకు భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం చాపర గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

బొలెరోను ఢీకొన్న లారీ

మందస: బాలిగాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి అరటి పండ్ల లోడుతో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహనం రాజమండ్రి నుంచి ఒడిశాకు వెళ్తుండగా టైరు పంక్చర్‌ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉంచగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆటో బోల్తాపడి

యువకుడు మృతి

రణస్థలం: నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి రాంబాబు (21) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబాబు స్వగ్రామం నుంచి ఆటోలో కోష్టా వస్తుండగా పైడిపేట శివాలయం సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో రాంబాబుకు బలమైన గాయం కావడంతో రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాంబాబుకు తల్లిదండ్రులు లక్ష్మీ, అసిరయ్య, తమ్ముడు గణేష్‌ ఉన్నారు. జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement