వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఇంటిపై దాడి
కాపుతెంబూరులో ఉద్రిక్తత
అధికారం అండతోనే..
నందిగాం: అతి సమస్యాత్మక గ్రామమైన కాపుతెంబూరులో తెలుగుదేశం మూకలు బరితెగించాయి. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆసపన్న రాజేశ్వరి ఇంటిపై మంగళవారం దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. రాజేశ్వరి భర్త జనార్దనరావు గ్రామంలోని కుమ్మరివీధిలో మరొక వ్యక్తితో కలిసి ప్రచారం చేస్తుండగా తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి ఇక్కడ ప్రచారం ఎందుకు చేస్తున్నావంటూ గొడవకు దిగారు. భౌతికదాడికి పాల్పడి ప్రచార కరపత్రాలను చించేశారు. అక్కడి నుంచి జనార్దనరావు ఇంటికి వెళ్లిపోగా, టీడీపీ మూకలు మూకుమ్మడిగా ఇంటి వద్దకు వెళ్లి కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకున్న నందిగాం పోలీసులు గ్రామానికి వెళ్లి అందరినీ చెదరగొట్టారు. పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నా ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోతే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు.
అధికార బలం ఉందని తెలుగుదేశం వర్గీయులు రెచ్చిపోతున్నారు. కుమ్మరి వీధిలో ప్రచారం చేస్తుంటే గుంపుగా వచ్చి దాడి చేశారు. ఓటమి భయంతో మాపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు.
– ఆసపన్న జనార్దనరావు,
కాపుతెంబూరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త


