ఆమదాలవలస: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో తెగుళ్ల నివారణకు రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు సూచించారు. కేవీకే, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 50 మంది రైతులతో మల్టీ లొకేషన్ ఆడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త ఎస్.కిరణ్‌కుమార్ (సస్య పోషణ), ఎస్.అనూష (సస్యరక్షణ) హాజరై వరి ఇతర పంటల్లో ప్రస్తుత సమస్యలు, వాటి నివారణ చర్యలను రైతులకు వివరించారు. వరి పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలని సూచించారు. నీరు తగ్గిన అనంతరం మాగుడు తెగులు వ్యాప్తిని తగ్గించేందుకు ఎకరాకు 400 మి.లీ.హెక్సకోనాజోల్ పిచికారీ చేయాలన్నారు. మానిపండు తెగులు నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రొపికోనాజోల్ పిచికారీ చేయాలని సూచించారు. ఆకు ముడత పురుగు నివారణకు ఎకరాకు 400 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కోతకు సిద్ధమైన కంకుల్లో మొలకలు కనిపిస్తే పొలంలోని నీటిని బయటకు పంపిన అనంతరం లీటరు నీటికి 50 గ్రాముల కల్లుప్పు కలిపిన 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. వరి పంటతో పాటు పత్తి మొక్కజొన్న ఆకు కూరగాయల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా శాస్త్రవేత్తలు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమాన్ని ఫౌండేషన్ ప్రతినిధి తిరుమలరావు, శ్రీకాకుళం సపోర్టర్ బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.


