టెక్కలి: టెక్కలి–3 వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సత్తారు ఉషారాణిపై అదే ప్రాదేశికం టీడీపీ అభ్యర్థి ధవళ ఈశ్వరిబాయి మరిది శ్రీను మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై అభ్యర్థి సత్తారు ఉషారాణి, ఆమె భర్త సత్తారు సత్యం, కుమారుడు పృథ్వీతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్ తదితరులు టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ప్రకారం.. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో, ఉషారాణి తన ప్రాదేశికంలో ప్రచారం చేస్తుండగా టీడీపీ అభ్యర్థి మరిది శ్రీను ఆ ప్రాదేశికానికి చేరుకుని ఆమైపె దురుసుగా ప్రవర్తించడంతో పాటు సెల్ఫోన్, కరపత్రాలను దౌర్జన్యంగా లాక్కున్నారని అంతే కాకుండా భౌతికంగా దాడి చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై టార్గెట్ చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఐదు సార్లు ఎంపీటీసీగా గెలుపొందిన తనపై మహిళ అనే కనీస మానవత్వం లేకుండా దాడికి పాల్పడ్డారని వాపోయారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.


