టీడీపీ పాలన మొత్తం అవినీతిమయం
శ్రీకాకుళం ఎమ్మెల్యే దిగజారిపోయారు
పాలనపై దుమ్మెత్తిపోసిన
వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో లక్ష్మీదేవికి సత్కారం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న చంద్రబాబుకు ఓటు తోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిలో పెడితే శ్రీకాకుళం వంటి వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడి అంతా ఒకే చోట పోగు కాకూడదని, హైదరాబాద్ వంటి అనుభవం మరోసారి ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ అధికార వికేంద్రీకరణ ఆలోచన చేసిందన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అదే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సన్మాన సభ నిర్వహించారు. ధర్మాన మాట్లాడుతూ.. కూటమి వచ్చిన రెండున్నరేళ్లలో కనీసం రూ.వంద కోట్ల పనులైనా శ్రీకాకుళంలో చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దాదాపు 20 ఏళ్లు పాలించినా జిల్లాకు ఏం చేశారని నిలదీశారు. అమరావతిలో సామాన్యుడికి ఒక్క ఎకరా అయినా భూమి ఉందా.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పనులు చేస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు అన్ని రకాల వనరులున్నా అభివృద్ధికి నోచుకోకపోవడానికి టీడీపీ నేతలే కారణమన్నారు. వైఎస్జగన్ హయాంలో జిల్లాలోని ఇచ్ఛాపురంలో సుమారు రూ.700 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, ఉద్దానం ప్రాంతంలో రూ.200 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి, సుమారు రూ.4వేల కోట్లతో సీ పోర్టు, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క ఫిషింగ్ హార్బర్‌ను కూడా నిర్మించలేని పరిస్థితి ఉండేదని, వైఎస్ జగన్ ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఇక్కడ లేఅవుట్ వేయాలంటే డబ్బులు కావాలి, బిల్డింగ్ ప్లాన్ మంజూరు చేయాలంటే డబ్బులు ఇవ్వాలి, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అంటే హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల సంపాదన వ్యవహారాలు చూస్తుంటే అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందన్నారు. విశాఖలో ఎకరం 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. వైఎస్ జగన్ చేసిన పనులకు రిబ్బన్లు కత్తిరిస్తూ తామే ఆ పనులు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వీటి గురించి చెబితే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. పొందూరులో ఐదుగురు అభ్యర్థులను అక్రమంగా ఏకగ్రీవం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఓటమి భయం ఉంటే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న హింసాత్మక ఘటనలు, రక్తపాతం గతంలో ఎప్పుడైనా చూశామా అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనం చేయడం చంద్రబాబుకు బాగా తెలుసని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, లంచాలు, మోసాలు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. ఈరోజు జరుగుతున్న బ్యాలెట్ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో గుండ లక్ష్మీదేవిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గుండ, ధర్మాన కుటుంబాలు పార్టీలు వేరైనా అంతిమంగా ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. వైఎస్సార్సీపీలో మంచి గౌరవం ఇస్తామని ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి సహకరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ తాము ఎలాంటి పదవులు ఆశించి పార్టీ మారలేదని, కేవలం ఆత్మ గౌరవం కోసమే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ మృతి చెందాక చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు తీవ్ర అవమానాలకు గురిచేశారన్నారు. తన భర్త విగ్రహం ఏర్పాటుకి అనుమతిచ్చినట్లు ఇచ్చి విగ్రహ ఏర్పాటుకి దిమ్మలు తొలగించడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. తోబుట్టువుల్లా ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌లు మనోధైర్యాన్నిచ్చి పార్టీలోకి ఆహ్వానించడం ఎంతో ధైర్యానిచ్చిందన్నారు.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు


