విద్యార్థినిపై దాడి దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై దాడి దుర్మార్గం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

ఎల్‌.ఎన్‌.పేట: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎంకే మిశ్రో ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని, మరొకరు ఇలాంటి పనులు చేయాలంటే భయపడే విధంగా శిక్ష ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

అనధికార మద్యం నిల్వలు ఉంటే చర్యలు

సోంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనధికార మద్యం నిల్వలు కలిగి ఉంటే చర్యలు తప్పవని ఎకై ్సజ్‌ సీఐ జి.వి.రమణ హెచ్చరించారు. సోంపేట మండలంలో ఆదివారం దాడులు నిర్వహించి 8.3 లీటర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. గతంలో వివిధ ఎకై ్సజ్‌ కేసుల్లో ఉన్న 25 మంది నిందితులను తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశామని పేర్కొన్నారు. బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా, లేదా సంవత్సరం జైలు శిక్ష పడుతుందన్నారు. దాడుల్లో ఎస్‌ఐ అప్పన్న, సిబ్బంది భానుప్రసాద్‌, అరుణ్‌, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

అంత్యక్రియలకూ అవస్థలే..

టెక్కలి: తొలుసూరుపల్లి పంచాయతీ ధర్మనీలాపురంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఆదివారం గ్రామానికి చెందిన సత్తారు శ్రీరాములు అనే వృద్ధుడు మృతి చెందడంతో, మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాల మీదుగా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. గ్రామంలో ఎవరు మృతి చెందినా ఇబ్బందులు తప్పడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

పుస్తెలతాడు చోరీ

నందిగాం: రాంపురం పంచాయతీ చిన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన కంచరాన రాధ పుస్తెలతాడు చోరీకి గురయ్యింది. నందిగాం ఎస్సై షేక్‌ మహమ్మద్‌ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం గ్రామ సీసీ రోడ్డుపై ఇద్దరు అపరిచిత వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గమనించిన రాధ తన ఇంటి తలుపులు వేసేసింది. కొంతసేపటి తర్వాత బయటకు వచ్చి ఆరబెట్టిన బట్టలు తీస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరిలో ఒకరు రాధను నెట్టేయగా, మరొకరు వచ్చి రెండున్నర తులాల పుస్తెల తాడు తెంచి టెక్కలి మండలం నర్సింగపల్లి వైపు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సరిహద్దులో విస్తృత తనిఖీలు

పాతపట్నం: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉన్నందున అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నామని పాతపట్నం సీఐ కిల్లి వెంకటరావు తెలిపారు. ఆదివారం పాతపట్నం సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వాహనాల ద్వారా అక్రమంగా మద్యం, నగదు తరలించే అవకాశం ఉన్నందున్న చెక్‌పోస్ట్‌ వద్ద 24 గంటల పాటు నిరంతర వాహన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ కె.మధుసూదనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement