సిక్కోలుకు తుఫాన్‌ ముప్పు | - | Sakshi
Sakshi News home page

సిక్కోలుకు తుఫాన్‌ ముప్పు

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

● మత్స్యకారులు వేటకు వెళ్లరాదు

● కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

జిల్లాలో తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన తక్షణ సాయం అందించేందుకు కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌ కేంద్రాలలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితులు, సమాచారం కోసం ప్రజలు ఈ కంట్రోల్‌ రూమ్‌లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోందని, ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ తుఫాన్‌ కాకినాడ–అనకాపల్లి ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలోనూ దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. గత నెలలో కళింగపట్నం, పోలాకి ప్రాంతాల మీదుగా వెళ్లిన తీవ్ర వాయుగుండం కంటే ఇది చాలా బలమైనదని, జిల్లాలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో పాటు ఈ నెల 27, 28 తేదీల్లో సుమారు 150 మిల్లీమీటర్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల ని విజ్ఞప్తి చేశారు. విపత్తు సమయంలో ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు జిల్లా కేంద్రంలో ఒకటి, డివిజన్‌ స్థాయిలో మూడు, మండలాల వారీ గా 30 కంట్రోల్‌ రూమ్‌లను తెరిచామని కలెక్టర్‌ పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులతో పాటు పోలీసు బందోబస్తు కూడా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. గర్భిణులు, బాలింతలు, వద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రాబోయే 3–4 రోజుల పాటు ముందుగానే సమీపంలోని ఆస్పత్రుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లాలోని తీర ప్రాంత 11 మండలాలు, నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతా ల్లోని 13 మండలాలపై తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ఒడిశా పరివాహక ప్రాంతాల్లో పడే భారీ వర్షాల కారణంగా గతంలోలాగే నదులకు వరద పోటెత్తే అవకాశముందని హెచ్చరించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు తీసుకున్నామని, అధికార యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను పాటిస్తూ ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశానికి ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంప్రదించాల్సిన నంబర్లు

జిల్లా కలెక్టరేట్‌ 08942–240557

శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం 9494233490

టెక్కలి ఆర్డీఓ కార్యాలయం 9704033093

పలాస ఆర్డీఓ కార్యాలయం 7386189275

వీటితో పాటు జిల్లాలోని 30 మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement