సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జెడ్పీటీసీ సీటుపై టీడీపీ పీటముడి వేసింది. తెలికిపెంట గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు తన సతీమణి రాజ్యలక్ష్మికి ఈ సీటు వస్తుందని ఆశ పడ్డారు. కానీ టీడీపీ మండలాధ్యక్షుడు అంబళ్ల రాంబాబు తన భార్యకు టికెట్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరూ నామినేషన్ వేయడం గమనార్హం. వీరిద్దరినీ కాదని బూర్జ మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పీరుట్ల విశ్వప్రసాద్ భార్యకు సరుబుజ్జిలి జెడ్పీటీసీ టిక్కెట్టు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ నక్కలపేట గ్రామానికి చెందిన సింగుపురపు దివ్య జనసేన తరఫున నామినేషన్ వేయడంతో రాజకీయం వేడెక్కింది. జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ సీటు కూడా కావాలని జనసేన పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో తెలుగు తమ్ముళ్లు లోలోన కుమిలిపోతున్నారు.


