సంతబొమ్మాళి: ఊరు ఒక చోట.. పోలింగ్ కేంద్రం మరోచోట ఏర్పాటు చేయడంపై పోర్టు నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కె.లింగూడు ఎంపీటీసీ పరిధిలోని ఈ గ్రామాలకు చెందిన నిర్వాసితులు ప్రస్తుతం నౌపడలోని పునరావాస కాలనీలో నివాసం ఉంటుండగా ఓటు వేసేందుకు నాలుగు కిలోమీటర్లు దూరంలోని పాత గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూలపేట పోర్టు నిర్మాణం నేపథ్యంలో మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి నౌపడలోని పునరావాస కాలనీలో స్థలాలు కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు చేప ట్టగా, ప్రస్తుతం సుమారు 550 కుటుంబాలు పునరావాస కాలనీలోనే నివాస ఉంటున్నాయి. గతంలో పోర్టు నిర్మాణానికి ముందు జరిగిన ఎన్నికల్లో మూలపేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ నిర్వహించారు. అయితే ప్రస్తుతం గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలో నివసిస్తున్నప్పటికీ, విష్ణుచక్రం గ్రామంలో ఓ ఇంటిని పోలింగ్ కేంద్రంగా అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో కాలనీలో ఉంటున్న ఓట ర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే నాలు గు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, ఇతర ఇబ్బందులు ఉన్న వారికి ఈ దూరం భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు నిర్మాణం కారణంగా గ్రామాలను విడిచి పునరావాస కాలనీలో స్థిరపడిన తమకు ఎన్నికల సమయంలోనూ ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రజలు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, ఓటర్లకు అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజలు ఒక చోట నివసిస్తుండగా, ఓటు వేయడానికి మరో చోటకు వెళ్లాల్సిన పరిస్థితిపై అధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ పార్వతీశంను వివరణ కోరగా, మూలపేట, విష్ణుచక్రం గ్రామాలను ఖాళీ చేసిన ఆ గ్రామాలకు డీ– నోటిఫై చేయకపోవడంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అర్హత సాధించలేదని, కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


