శ్రీకాకుళం క్రైమ్ : ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేయాలన్నా నేరుగా పోలీసులను సంప్రదించేలా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లలోని డీఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ల నంబర్లు ఇవే..
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ : 63099 90933
జిల్లా పోలీస్ ఎన్నికల సెల్ : 63099 90923
శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం : 63099 90804
కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం : 63099 90805
టెక్కలి డీఎస్పీ కార్యాలయం : 63099 90811
‘ఖర్చు పక్కాగా నమోదు కావాలి’
రణస్థలం: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ ఖర్చులు పక్కాగా నమోదు కా వాలని రాష్ట్ర వ్యయ పరిశీలకులు బీఏ కృష్ణమూర్తి తెలిపారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా వ్యయ పరిశీలకులు బీఏ కృష్ణమూర్తి రణస్థలం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు, లావాదేవీలపై అధికారుల సమగ్ర రిపోర్టు ఉండాలని అదేశించారు. అభ్యర్థులకూ కూడా ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ప్రచారం నిర్వహించాలని సూచనలు చేశారు. ఎన్నికల వ్యయ వివరాలు నమోదు, పర్యవేక్షణ ప్రక్రియలను నిబంధనల ప్రకారం సమర్థంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లకు వీడియో ప్రదర్శన ద్వారా స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల జనరల్ పరిశీలకులుగా నియమితులైన మల్లవరపు సూర్యతేజ ఆధ్వర్యంలో పనిచేయాలని, ఓటింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛ గా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారులపై ఉంటుందని తెలిపారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్నారు.
నామినేషన్లు ప్రశాంతం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మీడియాకు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రకటించిన కొత్త తేదీలకు అనుగుణంగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును పటిష్టం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, జన సమూహాల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.


