అప్పుడు పొత్తులు.. ఇప్పుడు కత్తులు | - | Sakshi
Sakshi News home page

అప్పుడు పొత్తులు.. ఇప్పుడు కత్తులు

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు కలిపిన కూ టమి నాయకులు స్థానిక ఎన్నికల వేళ కత్తులు దూసుకుంటున్నారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ.. తమ మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలను కూరలో కరివేపాకులా తీసిపారేస్తోంది. సార్వత్రిక ఎన్నికల విజయానికి సహకరించిన జనసేన నాయకులను లెక్క చేయడం లేదు. పొత్తుల పేరుతో మిత్రపక్షాల ఉనికిని జిల్లాలో లేకుండా చేయాలనే వ్యూహాత్మక పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తేలని సీట్ల పంచాయతీ..

ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌లకు సంబంధించిన వ్యవహారం దాదాపు ముగిసిపోయింది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ సీట్లు సర్దుబాటు పూర్తికాలేదు. ఎవరికి తోచినట్టు వారు నామినేషన్‌ వేసుకున్నారు. తన పార్టీ నాయకుల ఆవేదనను జనసేన కనీసం అర్థం చేసుకోవడం లేదు. బీ ఫారా లు ఇవ్వకుండా టీడీపీకి వత్తాసు పలికేలా వ్యవహరించడంతో కొందరు ఇండిపెండెంట్‌గా నిలవక తప్పలేదు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఎవరికి ఎక్కడో చెప్పకపోవడంతో జనసేన, బీజేపీ నాయకులు సందిగ్ధంలో ఉన్నారు. అధిష్టానాల నుంచి క్లారిటీ రాకపోవడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

ఎవరికి వారే..

ప్రతిపాదిత స్థానాలను చూసి జనసేన, బీజేపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కేటాయించిన స్థానాలు తక్కువగా ఉన్నాయని జనసేన నాయకులు భగ్గుమంటున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్‌, ఓట్లు ఉన్న స్థానాలను కూడా టీడీపీ తమకే ఉంచుకోవాలని చూడటంపై జనసేన శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘బలం ఉన్న చోట పోటీ చేసి తీరుతాం.. సీటు కేటాయించకపోయినా బరిలో ఉంటాం’ అని జనసేన ఆశావహులు అధి ష్టానాలకే హెచ్చరికలు జారీ చేస్తుండటం జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. దీంతో అధిష్టానాలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకముందే కూ టమిలోని మూడు పార్టీల నేతలు ఎవరికి వారే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఉన్న చోట జనసేన, జనసేన అభ్యర్థి ఉన్న చోట టీడీపీ పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. నరసన్నపేట, పోలాకి మండలాల జెడ్పీటీసీ స్థానాలకు జనసేన, బీజేపీ నాయకులు వేర్వేరుగా నామినేషన్లు వేస్తున్నారు. అదే విధంగా నరసన్నపేట నియోజకవర్గంలో అనేక ఎంపీటీసీ స్థానాలకు జనసేన నాయకులు పోటాపోటీ నామినేషన్లు వేస్తున్నా రు. బీజేపీ, జనసేనలకు అవకాశం ఇవ్వలేమని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కరాఖండిగా చేప్పేయంతో ఇండిపెండెంట్‌ బాట పడుతున్నారు. పాతపట్నంలో కూడా టీడీపీతో నువ్వానేనా అంటూ జనసేన పోటీ పడుతోంది. కనీసం 30శాతం స్థానాలకు తమకు ఇవ్వాల్సిందేనని జనసేన శ్రేణులు పట్టుబట్టడంతో గొంతెమ్మ కోరికలు తీర్చలేమని టీడీపీ చెప్పేస్తుండటంతో ఏం చేయలేక.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామంటూ కాలు దువ్వుతున్నారు.

మంత్రి ఇలాకాలోనూ..

టెక్కలి: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో సైతం పొత్తు పార్టీల్లో తిరుగుబాటు తప్పలేదు. టెక్కలి మండలం జెడ్పీటీసీ స్థానంతో పాటు నాలుగు మండలాల్లో పలు ప్రాదేశికాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో సైతం ఎంపీటీసీ స్థానాల్లో జనసేన, బీజేపీ కార్యకర్తలు నామినేషన్‌లు వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన నాయకులు వేసిన నామినేషన్‌లను విత్‌డ్రా చేసుకోకుండా చివరి వరకు కొనసాగించి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారా లేక మధ్యలోనే కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అభాసుపాలవుతారా అనే చర్చ నియోజకవర్గంలో కొనసాగుతోంది.

కూటమిలో తేలని సీట్ల పంపకాలు

సార్వత్రికంలో సహకరించిన మిత్రపక్షాలకు టీడీపీ ఝలక్‌

జనసేన, బీజేపీ శ్రేణులను కరివేపాకులా

తీసి పారేస్తున్న టీడీపీ నాయకులు

అరకొర కేటాయింపులపై భగ్గుమంటున్న జనసేన శ్రేణులు

బలం ఉన్నచోట పోటీ చేసేందుకు నామినేషన్లు

మిత్రపక్షాల స్వతంత్ర రాగంతో టీడీపీకి గుబులు

టీడీపీకి రెబెల్‌ గుబులు

మిత్ర పక్షాల అసంతృప్తి ఒకవైపైతే.. సొంత పార్టీలోనే రెబెల్స్‌ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. జెడ్పీ పీఠంపైనే కాదు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాలపై కూడా చిచ్చు నెలకొంది. ఇప్పటికే పలాస మున్సిపాలిటీలో టీడీపీ రెబెల్‌ అభ్యర్థి దువ్వాడ శ్రీజ.. ఆ పార్టీపై పెద్ద ఎఫెక్ట్‌ చూపిస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ పీఠంపై నలుగురైదుగురు నేతలకు తమకే ఇవ్వాలని పట్టుబట్టడంతో అధిష్టానం ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరోవైపు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌, మరోవైపు కింజరాపు బ్యాచ్‌ ఎవరికి వారు తగ్గకుండా అడుగుతుండటంతో చైర్‌పర్సన్‌ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది. తర్వాత చూసుకుందామనే ధోరణిలో అడుగులు వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement