ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలేం పంచాయతీ నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న దళిత, బీసీ, పేద రైతులకు సాగు హక్కులను కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కె.మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావులు కోరారు. ఈ మేరకు మంగళవారం నారాయణపురం భూసాగుదారుల కమిటీ ఆధ్వర్యంలో రైతుల సాగుహక్కు కోసం చేపట్టనున్న పాదయాత్రలో భాగంగా ప్రజా గాయకుడు కె.హేమసుదన్ పాడిన పాటల సీడీని చిలకపాలేంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిలకపాలేం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు ఈనెల 21, 22వ తేదీల్లో చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. పాదయాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ బి.తులసీరావులు హాజరవుతారన్నారు. సాగుదారులకు పట్టాలు లేకపోవడం వలన రైతుభరోసా, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి ప్రభుత్వ పథకాలు అందక రైతులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ బకాసురులు తప్పుడు పత్రాలను సృష్టించి తరతరాలుగా సాగు చేస్తున్న రైతుల భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సాగుదారులుగా నమోదు చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎన్‌వీ రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, తోనంగి నందోడు, పుట్టా బుచ్చిబాబు, కోరాడ అప్పన్న, జరజాపు సీతారాం, పైడియ్య తదితరులు పాల్గొన్నారు.


