● పింఛన్‌ కావాలా.. ఇంటికి రండి! | - | Sakshi
Sakshi News home page

● పింఛన్‌ కావాలా.. ఇంటికి రండి!

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

బారువలో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద పింఛన్‌ దరఖాస్తులు

తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన లబ్ధిదారులు

ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవాలి

గత ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందించాం. కూటమి ప్రభుత్వంలో పేదవాడు పెన్షన్‌ కోసం ఒకరి దగ్గరికి వెళ్లి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. – సాడి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి,

వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త

ఏడు రోజులేనా..?

పింఛన్‌ దరఖాస్తులకు ఏడు రోజులే గడువు విధించడం అన్యాయం. అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేయాలి. – డాక్టర్‌ నిమ్మన దాస్‌, ఎంపీపీ

సోంపేట:

పింఛన్‌ కోసం సామాన్యుడు ఎవరిపైనా ఆధారపడకూడదని.. ఎవరి ఇంటి వద్ద పడిగాపులు కాసే అగత్యం రాకూడదని వైఎస్సార్‌ సీపీ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కానీ టీడీపీ మళ్లీ పాత పోకడలే పోతోంది. పింఛన్‌ ఆశావహులను ఇంటి వద్దకు రప్పించుకుని దరఖాస్తులు తీసుకున్న ఘటన బారువలో చోటు చేసుకుంది. బారువ గ్రా మానికి చెందిన టీడీపీ మండల స్థాయి నాయకుడు ఇంటి వద్దనే దరఖాస్తులు స్వీకరించి అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సచివాలయం వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా.. బారువ మేజర్‌ పంచాయతీ పరిధిలో నాయకుడు తన ఇంటి వద్దకే దరఖాస్తు దారులను రప్పించుకున్నాడు. ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి ఆన్‌లైన్‌ చేయడం విశేషం. దీనిపై స్థానికులు తీవ్ర విమర్శలు చేశారు. ఇంటికి పిలిపించుకోవడం పేదల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడమేనని అన్నా రు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో ఈ పింఛన్ల గిమ్మిక్కులు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుడి ఇంటి వద్ద పింఛన్‌ దరఖాస్తుల అంశంపై బారువ మేజర్‌ పంచాయతీ ఈఓ రాజేష్‌ను వివరణ కోరగా సచివాలయాలకు వచ్చేవారి దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌ చేస్తున్నామని, మంజూరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు సచివాలయాల వద్ద తిష్ట వేసుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement