ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలం సైదాలపుట్టుగలో పొలం పనులకు వెళ్లిన ఓ రైతు బాహుదా నదిని దాటుతుండగా గల్లంతయ్యారు. సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య (57)కు బాహుదానదికి అవతల శాసనాం గ్రామ పరిధిలో పంట భూమి ఉంది. సోమవారం నదిని దాటి పొలం గట్టు వేసి, దమ్ము పనులు చేశారు. మంగళవారం ఉదయం గంగయ్య భార్య జానకమ్మ తమ పొలంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. గంగయ్య ఆమెకు భోజనం తీసుకొని మధ్యాహ్నం బాహుదా నదిని దాటుతుండగా నది ఉద్ధృతికి నీటిలో కొట్టుకుపోయారు. నదిలో స్నానం చేస్తున్న స్థానికులు ఆ ఘటనను గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ ఎం.చిన్నంనాయు డు, రూరల్ ఎస్‌ఐ ఆర్.జనార్దనరావులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు సాయంత్రం వరకు నదిలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. గంగయ్య భార్య జానకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ జనార్థనరావు తెలిపారు. నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు తెలిపారు.


