శ్రీకాకుళం పాతబస్టాండ్: తీర ప్రాంత భద్రతకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మైరెన్ పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తీర ప్రాంత భద్రతపై మైరెన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 193 కిలో మీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉందని, ఇందులో 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నట్లు వివరించారు. తీర ప్రాంతంలో 3 మైరెన్ పోలీసు స్టేషన్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 172 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయన్నారు. తీర ప్రాంత పోలీసు స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ కావాలని మైరెన్ పోలీసులు కలెక్టర్‌కు విన్నవించారు. తీర ప్రాంత ప్రజలకు, బీచ్‌లకు వచ్చే పర్యాటకులకు భద్రపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు సుమలత, ఎన్‌ఐసీ ఉప సంచాలకులు కిరణ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రాము, మైరెన్ డీఎస్పీ, విశాఖపట్నం ఎస్.కిరణ్ కుమార్, బారువ, భావనపాడు, కళింగపట్నం సీఐలు రమేష్, డి.రాము, బి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


