శ్రీకాకుళం పాతబస్టాండ్: రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నోడల్ సింగిల్ విండో ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని, ఎలాంటి కాషన్ డిపాజిట్లు, రుసుములు వసూలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. గతేడాది మాదిరిగానే జిల్లావ్యాప్తంగా ఉచిత విద్యుత్ సరఫరా అందించాలని, విగ్రహాల ఎత్తు, పర్యావరణ కాలుష్యం పేరిట నిబంధనలతో ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచనలు ఇవ్వాలని విన్నవించారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ముందస్తుగా రూట్ మ్యాప్ ఆమోదించి భద్రతా ఏర్పాట్లు చేయాలని, నిమజ్జన ప్రాంతాల్లో జేసీబీలు, క్రేన్లు, పరిశుభ్రత సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ప్రశాంత వాతావరణం నెలకొనేలా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు బుర్రా ఆదినారాయణ శాస్త్రి, ఉపాధ్యక్షుడు శింతు సుధాకర్, ప్రధాన కార్యదర్శి గొడ్డు భాస్కరరావు, కోశాధికారి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


