విన్నపాలు వినవలె..! | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె..!

Aug 25 2026 1:57 AM | Updated on Aug 25 2026 1:57 AM

అర్జీలు జిల్లాస్థాయి అధికారులు

పరిశీలించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పీజీఆర్‌ఎస్‌కు 171 వినతులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజల నుంచి వచ్చే అర్జీలను జిల్లాస్థాయి అధికారులు స్వయంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో 171 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు మాత్రమే హాజరవ్వాలని, సెకండ్‌ లెవెల్‌ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావొద్దని తేల్చిచెప్పారు. మొత్తం 171 అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్‌ఏ) శాఖకు సంబంధించి 88 వినతులు వచ్చాయి. పంచాయతీ రాజ్‌ శాఖకు 18, సర్వే సెటిల్మెంట్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ 9, సెర్ప్‌ 9, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 9, విద్యుత్‌ శాఖ 8, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 6, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ 4, ఏపీ స్టేట్‌ స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 3, సమగ్ర శిక్ష 3 చొప్పున అర్జీలు నమోదయ్యాయి. అదేవిధంగా ఏపీ ఎస్సీ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, జలవనరులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖలకు చెరో 2 చొప్పున వినతులు వచ్చాయి. గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, గ్రామీణాభివృద్ధి, ఏపీఎస్‌ ఆర్టీసీ, హౌసింగ్‌ కార్పొరేషన్‌, పోలీసు, సివిల్‌ సప్లయ్‌, వ్యవసాయ శాఖ, మహిళా శిశు సంక్షేమం, టిడ్కో, మత్స్య శాఖ, ఆర్థిక శాఖలకు చెరో 1 చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు.

పలు వినతులు పరిశీలిస్తే...

● పోలాకి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య వినతిపత్రం అందజేశారు.

● ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారిందని కాలనీకి చెందిన వానపల్లి లక్ష్మి, మీసాల వనజాక్షి, కె.మాలతి, కృపా, ఎం.కృష్ణవేణి, జె.ధనలక్ష్మి తదితరులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, దీంతో అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

● సారవకోట మండలం పెద్దలంబ గ్రామానికి చెందిన లుకలాపు చిన్నారావు తన ఆస్తిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. గతంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని వాపోయారు.

● జిల్లాలోని పలు ప్రైవేట్‌ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు, హాస్టళ్లు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత ఆర్‌ఐఓ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్టళ్లను వెంటనే మూసివేయాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్‌ కళాశాలలను సీజ్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

● వృద్ధాప్య పింఛన్‌ పేరుతో సంతకం చేయించుకొని తన ఆస్తిని తన తమ్ముడు పల్లిసారధి గ్రామానికి చెందిన బెలమర మోహనరావు రాయించుకున్నాడని పలాస మండలంలోని కాశీబుగ్గ పోస్టు తాళభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి ధమయంతి ఫిర్యాదు చేశారు. మాయ మాటలు చెప్పి, పింఛను ఇప్పిస్తానని మోసం చేశాడని వాపోయారు. అధికారులు స్పందించి తన భూమి తన పేరిట మార్చాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement