అరసవల్లి : జిల్లా వైద్యారోగ్య శాఖలో ఏ విభాగాన్ని కదిపినా అవినీతి కంపే వస్తోంది. పెద్దస్థాయి ఉద్యోగుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వరకు చాలామందికి తెరవెనుక వ్యాపారాలు, వ్యవహారాలే ప్రాధ్యాన్యతగా కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘అక్రమాల సీను’ వ్యవహారాల్లో కూడా ‘మందుల’ ఏజెన్సీ లీలలు జిల్లా వైద్యారోగ్య శాఖకు అక్రమాల మచ్చను తెచ్చిపెడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ ఆస్పత్రులతో పాటు మంచి ప్రాక్టీస్‌లున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు లెక్కకు మించి, అవసరాలకు మించి మందులను కొనుగోలు చేసుకునేలా అత్యధిక ఆస్పత్రుల్లో వ్యవహారాలు నడుస్తున్నాయి. అదో రకమైన దందా అయితే.. అనధికారిక డెమో అవతారమెత్తిన సదరు హెల్త్ అసిస్టెంట్ తనకున్న ఏజెన్సీకే మందుల ఇండెంట్ ఇవ్వాలని..లేదంటే ఆస్పత్రుల్లో సౌకర్యాల లోపాలపై నివేదించి జరిమానాలు విధిస్తా...అంటూ మరో కొత్త దందాకు తెరలేపారు.
ఇండెంట్ ఇవ్వకపోతే..
జిల్లాలో పలు పట్టణాలతో పాటు జిల్లా కేంద్రంలో అత్యంత ఆధునిక వసతులతో వందలాది బెడ్లుతో ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం వివిధ రకాల ప్రైవేటు వైద్య కేంద్రాలు 435 వరకు ఉన్నాయి. వీటిలో పోలిక్లినిక్స్ 26, డెంటల్ క్లినిక్స్ 59, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ 172, ల్యాబ్స్ 110, హైఎక్విప్డ్ ల్యాబ్స్ 13, ఫిజియోథెరపీ కేంద్రాలు 06, క్లినిక్స్ 49 వరకు ఉన్నాయి. కొత్త క్లినిక్‌లకు రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌కు..ప్రభుత్వానికి రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. మొదట మూడు నెలలకు అనుమతిచ్చి తర్వాత డెమో అధికారిక బృందం తనిఖీల అనంతరం అన్ని నిబంధనల ప్రకారం ఉంటే ఐదేళ్లకు రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. తర్వాత రెన్యువల్స్ చేయించాల్సి ఉంటుంది. అదే స్కానింగ్ సెంటర్లు అయితే ప్రతి 3 నెలలకు డెమో విభాగమే తనిఖీలు చేసి సర్టిఫై చేస్తుండాలి. ఇదే అదనుగా తెరవెనుక సదరు హెల్త్ అసిస్టెంట్‌తో పాటు డెమో సిబ్బంది అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు ఫిర్యాదులు కూడా చేశారు. మరోవైపు వైద్యశాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చేయాలంటే.. మీ ఆసుపత్రులకు కావాల్సిన మందులను మా ఏజెన్సీకే ఇండెంట్ ఇవ్వాలని, లేదంటే ఫైన్లు వేయిస్తామంటూ కండీషన్ పెడుతూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారనే అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఏజెన్సీతో పాటు మరో కీలక స్నేహితుని ఏజెన్సీల్లో మందులనే మాత్రమే ఇండెంట్లు అధికంగా వచ్చేలా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా వైద్య శాఖ ఉన్నతాధాకారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణకు ఆదేశిస్తే...హెల్త్ అసిస్టెంట్ వ్యవహారాలతో పాటు ఎన్‌హెచ్‌ఎం విభాగంలో అవినీతి తిమింగళాల వ్యవహారాలు మరిన్ని బయటపడే అవకాశాలుంటాయని వైద్యశాఖ ఉద్యోగుల్లోనే చర్చసాగుతోంది.
తమ వద్ద మెడిసిన్ కొనకపోతే ‘ఫైన్’ తప్పదు
ప్రైవేటు ఆస్పత్రుల్లో అనధికార ‘డెమో’ హుకుం
అటు అక్రమ వసూళ్లు.. ఇటు ‘మందుల’ ఇండెంట్‌పై ఒత్తిళ్లు


