మేతగాళ్ల జేబులోకి.. వేటగాళ్ల సొమ్ములు..! | - | Sakshi
Sakshi News home page

మేతగాళ్ల జేబులోకి.. వేటగాళ్ల సొమ్ములు..!

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

మేతగాళ్ల జేబులోకి.. వేటగాళ్ల సొమ్ములు..!

పోలాకి:

రాకాసి అలలను దాటుకుంటూ నడిసముద్రంలో వేట సాగించి తమ జీవననావను ముందుకు సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో వారి కుటుంబ పోషణకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా సొమ్ములు కొంతమంది నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయని అర్హులైన లబ్ధిదారులు చెబుతున్నారు. పోలాకి మండలం అంపలాం పంచాయతీ రాజారాంపురంలో కొన్ని లక్షల రూపాయల వేటగాళ్ల సొమ్ములు మేతగాళ్లు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిలదీశారనే నెపంతో గ్రామానికి చెందిన 24 మంది అర్హులైన మత్స్యకారులకు పథకం వర్తింపజేయకుండా కొర్రీలు పెడుతున్నారు. దీనిపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఫిర్యాదు వెనక్కుతీసుకోవాలని బాధితులు ఒత్తిడి చేశారని, సదరు నేతల నుంచి తమకు హాని జరిగే అవకాశం ఉందని బాధితులు తాజాగా సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదీ పరిస్థితి..

మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలో డమ్మీలే ఎక్కువగా ఉన్నారని, కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో రాకపోవటంతో మొత్తం గుట్టు బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. రాజారాంపురం తీరం నుంచి రిజిస్టర్‌ కాబడిన బోట్లపై సముద్రంలోకి వేటకు వెళ్లినట్లు వచ్చిన లబ్ధిదారుల జాబితాలో తీరప్రాంతానికి సంబంధం లేని గ్రామాల వ్యక్తుల పేర్లు సైతం ఉన్నాయని ఆధారాలతో సహా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. రాజారాంపురం తీరంలో 84 బోట్లు, 75 తెప్పలు రిజిస్టర్‌ కాబడి ఉంటే అందులో ఎన్నిబోట్లు, ఎన్ని తెప్పలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పథకం ఏమేరకు పక్కదారి పట్టిందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ఒక బోటుకు ఆరుగురు, తెప్పకు ముగ్గురు చొప్పున 728 మంది క్రూమెంబర్లు(కలాసీలు)గా అంపలాం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 687 మందిని అర్హులుగా గుర్తించారు. రాజారాంపురం తీరం నుంచి వేటసాగితే అంతే స్థాయిలో ప్రొడక్టివిటీ కూడా ఉండాల్సి ఉంది. ఆ విషయానికి వస్తే జిల్లాలో ప్రతిచోటా దాదాపు ఇలాంటి వ్యవహారమే ఉందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. మత్స్యకార భరోసా అందించే వేటగాళ్ల జాబితాకు, మన మత్స్యకారులు నిజంగా కష్టపడి వేటసాగించి తీసుకువచ్చే ప్రొడక్టివిటీ లెక్కలకు ఎక్కడా సరిపోలటం లేదు. రాజారాంపురం విషయానికి వస్తే బాధితులుగా చెప్పబడుతున్న 24 మందిలో కొంతమంది మత్స్యకారేతర కుటుంబాల వ్యక్తులు ఉన్నారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్న మాట. ఇక్కడ ఇప్పటికే సొమ్ములు అందుకున్న 704 మందిలో అందరూ మత్స్యకారులేనా అంటే అక్కడా సమాధానం కుదరటంలేదు. సరికదా.. సదరు జాబితాలో నాన్‌ లోకల్‌ వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. మత్స్యకార భరోసా కోసం సముద్రంలో వేటసాగించే తీరప్రాంత వ్యక్తులు అందరూ అర్హులే తప్ప ఎక్కడా మత్స్యకారులు మాత్రమే ఉండాలని లేదని అర్హులైన బాధితులు చెబుతున్నారు.

మత్స్యకార భరోసాలో డమ్మీ లబ్ధిదారులు

లక్షల రూపాయలు నొక్కేశారని అర్హుల ఆవేదన

ఇదే విషయమై నిలదీశారని

రాజారాంపురంలో 24 మంది పై కక్షసాధింపు

న్యాయం చేయాలని కలెక్టర్‌ను

ఆశ్రయించిన బాధితులు

తుప్పల్లో తెప్పలు..జాబితాలో పేర్లు..

రాజారాంపురం తీరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏళ్ల తరబడి ముళ్లపొదలు, తుమ్మతుప్పల్లో చెదలు పట్టిపోయిన బోట్లకు కూడా రంగులేసి రిజిస్టర్‌ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.1.37 కోట్లు మత్స్యకార భరోసా సొమ్ము అంపలాం సచివాలయం పరిధిలో అందితే అందులో సగానికిపైగా డమ్మీజాబితా ఖాతాల్లోకే చేరాయని తెలుస్తోంది. ఈ పథకమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే డీజిల్‌ బిల్లు సైతం ఇలాంటి వేటకెళ్లని బోట్లు పేరుతో రాయితీ దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అర్హులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement