ప్రతీ అర్జీని ఆడిట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ అర్జీని ఆడిట్‌ చేయాలి

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

ప్రతీ అర్జీని ఆడిట్‌ చేయాలి ● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ● పీజీఆర్‌ఎస్‌కు 165 వినతులు

పెన్షన్లు పునరుద్ధరించండి

మత్స్యకార భరోసాలో అక్రమాలు

● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ● పీజీఆర్‌ఎస్‌కు 165 వినతులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ప్రతీ అర్జీని జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించడంతో పాటు ఖచ్చితంగా గ్రీవెన్స్‌ ఆడిట్‌ నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని, జాప్యానికి తావులేకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 165 ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కాగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ పీఏ ఆ శాఖ పరమైన సమస్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆమెకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో టెన్త్‌, ఇంటర్మీడియట్‌ అడ్మిషన్స్‌ ప్రారంభం గోడ పత్రికను ఆవిష్కరించారు.

కొన్ని వినతులు పరిశీలిస్తే..

●జిల్లాలో రైతులకు ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు.

●శ్రీముఖలింగం క్షేత్రంలో 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని శ్రీముఖలింగేశ్వర దేవస్థానం అర్చక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయుడుగారి రాజశేఖర్‌ కోరారు.

దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు..

●జిల్లాలోని భైరవానిపేట గ్రామానికి చెందిన 14 దళిత కుటుంబాలకు 2013లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పచ్చ తోరణం కింద ఒక్కొక్కరికి 100 మొక్కల్ని ఇవ్వడం జరిగింది. అయితే దళితులకు ఇచ్చిన మొక్కలపై కూటమి నాయకులు పెత్తనం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి పీజీఆర్‌ఎస్‌లో కోరారు. రాత్రి సమయంలో కొబ్బరి చెట్ల ఫలసాయాన్ని దొంగతనంగా కోస్తున్నారని, అడిగితే దిక్కున్నచోట చెప్పుకోండని దళితులను భయపెడుతున్నారన్నారు.

ఆమదాలవలస మండలంలోని కొత్తరోడ్డు జంక్షన్‌లో బావాజీ మఠం భూముల్లో అక్రమ లే అవుట్‌కు ఎంపీ ల్యాడ్‌ నిధులు మంజూరు సరికాదని, అక్కడ జరుగుతున్న అక్రమాలు పరిశీలించాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. అలాగే బుర్జ మండలంలోని అన్నంపేట గ్రామం భూ వివాదం అంశంపై నిజమైన హక్కుదారునకు న్యాయం చేయాలని విన్నవించారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి పంచాయతీలో అక్రమంగా తొలగించిన వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లను వెంటనే పునరుద్దించాలన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పైడి పోలయ్య తదితరులు ఉన్నారు.

మత్య్సకార భరోసా పథకం లబ్ధిదారుల పేర్లలో అవకతవకలు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలాకి మండలం అంపలాం గ్రామ మత్స్యకారుడు మైలపల్లి సూరిబాబు కోరారు. వాస్తవంగా గ్రామంలో 100 కుటుంబాలు కంటే తక్కువ మంది వేటకు వెళ్లిన మత్య్సకారులు ఉండగా, 640 మందికి మంజూరైనట్లు జాబితాలు వచ్చాయన్నారు. దీనిపై నిలదీసినందుకు 24 మంది అర్హులైన మత్స్యకారుల పేర్లను లబ్ధిదారులు జాబితా నుంచి తొలగించారని తెలిపారు. ఇది చాలా అన్యాయమని అడిగితే దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement