కవిటి మండలం శిలగాం సమీపంలోని అల్లేరు భూములను కొబ్బరి రైతుల ప్రయోజనాలకే వినియోగించాలని, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. శిలగాం గ్రామ పరిధిలోని సర్వే నంబర్–110లో ఉన్న 21.76 ఎకరాల అల్లేరు భూములను 1990లో కొబ్బరి, జీడి, మామిడి రైతుల అభివృద్ధి కోసం ఉద్యానవన శాఖకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు పేరుతో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రావడం వల్ల కొబ్బరి రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ భూముల్లో కొబ్బరి అనుబంధ పరిశ్రమలకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఈ భూమిలో శిలగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించిన ఐదు ఎకరాల ఆట స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇటీవల పెద్ద కర్రివానిపాలెం మత్స్యకార గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ ప్రమాదంలో ఎనిమిది కుటుంబాలు తీవ్రంగా నష్టపోగా, వాటిపై ఆధారపడిన మరో 50 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. సుమారు రూ.88 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కడియాల ప్రకాష్ పాల్గొన్నారు.


