● కోడళ్లకు చుక్కలు చూపిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ
● పుట్టింటి ఐడీ ఆధారాలు సమర్పించేందుకు ఇబ్బందులు
● గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా
చిక్కులు
హిరమండలం: జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఓటర్లకు చుక్కలు చూ పిస్తున్నాయి. ముఖ్యంగా 2002 తర్వాత వివాహం జరిగిన మహిళలకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్స్‌ను తీసుకునేందుకు బీఎల్‌ఓలు ముందుకు రావడం లేదు. అలాంటి వారి ఓటు మ్యాపింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా కోడళ్ల ఓట్లపై కుటుంబా ల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా నిరక్షరాస్యులకు ఈ విషయంలో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు.
జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో 18,97,116 ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,92,904 మ్యాపింగ్ జరిగాయి. జిల్లాలో 2,358 బూత్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి బూత్‌కు ఒక్కో బూత్‌లెవల్ ఆఫీసర్(బీఎల్‌ఓ)ను నియమంచారు. వీరి దగ్గరే ఆయా బూత్‌లకు సంబంధించి 2002, 2025 ఓటరు జాబితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్ (ఈసీ)చెబుతోంది. అయితే బీఎల్‌ఓలు మాత్రం తమ దగ్గర ఆయా ఓటరు జాబితాలు లేవని, ఉన్నా ఎంతమందికి ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫాం తోపాటు 2002, 2025 ఓటరు జాబితా వివరాలు బీఎల్‌ఓలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
గిరిజన ప్రాంతాల్లో..
జిల్లాలో పాతపట్నం, పలాస నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 80 వేల మంది వరకూ గిరిజన మహిళా ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఒకేచోట ఉండే పరిస్థితి ఉండదు. కొండ శిఖర గ్రామాలతో పాటు గూడల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. ఆ పై నిరక్షరాస్యులే అధికం. ఈ రెండు కారణాలతో వీరి ఓట్ల మ్యాపింగ్ చాలా కష్ట మని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2002 తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన వారికి చిక్కుముడులు ఎదురవుతున్నాయి. పుట్టింటి నుంచి ఓటరు ఐడీ, ఇతర ఆధారాలు తెస్తేనే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తామని బీఎల్‌ఓ లు తేల్చిచెబుతున్నారు. మరి కొంతమంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ ఫామ్ ఎలా నింపాలి, ఏయే వివరాలు ఉండాలో తెలియపరచడం లేదని ఆరోపిస్తున్నారు. ఎప్పుడో వివాహాలు జరిగి మెట్టినింటికి వచ్చిన వారికి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారిలో ఎక్కువగా గిరిజన మహిళలే అధికంగా ఉంటున్నారని సర్వే అధికారులు చెబుతున్నారు.
ఆ నిబంధనతో..
వివాహం తర్వాత మెట్టినింటికి వచ్చిన మహిళలు తప్పకుండా తమ పుట్టినింటి ఐడీ వివరాలు అందించాల్సిందేనని చెబుతుండడంతో వారు బిక్కమొఖం వేస్తున్నారు. సాధారణంగా ఏళ్ల కిందట వివాహాలు జరిగి మెట్టినింటికి వచ్చేవారికి ఎలాంటి ఆధారాలు ఉండవు. గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యులే అధికం. దీంతో ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతవుతాయన్న ఆందోళన రాజకీయ పార్టీల్లో ఉంది. మరోవైపు వివరాలు లేవని చెప్పి చాలామంది ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని అధికార పార్టీపై విపక్షాలకు అనుమానాలు ఉన్నాయి.


