వేసెయ్‌ పాగా! | - | Sakshi
Sakshi News home page

వేసెయ్‌ పాగా!

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

వేసెయ్‌ పాగా! చెరువు జాగా.. మాజీ సర్పంచ్‌ పనే.. అధికారులు స్పందించాలి చెరువును పరిశీలిస్తాం..

శ్రీకాకుళం రూరల్‌: కోర్టులో కేసు నడుస్తున్నా.. ప్రభుత్వ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినా.. స్థలాల ఆక్రమణ విషయంలో మాత్రం కూటమి నాయకులు వెనక్కి తగ్గడం లేదు. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామన్న రీతిలో కబ్జాలకు తెగబడుతున్నారు. అధికారం చేతిలో ఉందనే అండతో చెలరేగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సింగుపురంలో ప్రధాన రహదారిని ఆనుకొని కోట్ల రూపాయల విలువ చేసే ముసలగుండం చెరువుపై కబ్జాదారుల కన్ను మరోసారి పడింది. గ్రామ సచివాలయం ఎదురుగానే ఈ చెరువు స్థలం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. రెవెన్యూ, పంచాయతీ అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

సింగుపురం గ్రామ ప్రారంభంలోనే సుమారు 200 ఏళ్ల కిందటి ముసలగుండం చెరువు ఉంది. దీని విస్తీర్ణం రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్‌ 270/4లో సుమారు నాలుగు ఎకరాలు. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఎకరా కోటి రూపాయలపైనే ధర పలుకుతోంది. అప్పట్లో గ్రామస్తులు ఓవైపు తాగునీటి అవసరాలకు, మరోవైపు స్నానాలకు వాడుకునేవారు. ఏటా నిర్వహించే కొండమ్మతల్లి జాతర ఉత్సవాల్లో సైతం ఊరేగించిన ఉత్సవ విగ్రహాలకు ఇందులో పవిత్ర స్నానాలు చేయించేవారు. కాలక్రమేణ చెరువు వినియోగం తగ్గిపోయింది. గ్రామాల్లో తాగునీటి కుళాయిలు రావడం, బోర్లు, ఇతరత్రా వసతులు స్థానిక ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో గ్రామస్తులు చెరువుపై ఆధారపడటం మానేశారు.

కూటమి నేతల కన్ను..

2024 జనవరిలో చెరువు అంతటినీ డంపింగ్‌ యార్డులోని మట్టిని తీసుకొచ్చి రాత్రికిరాత్రే కప్పేందుకు ఓ కూటమి నాయకుడు కుట్రపన్నాడు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో అప్పటి తహశీల్దార్‌ వెంకట్రావు చెరువు చుట్టువైపులా ప్రభుత్వ చెరువు అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఆక్రమణ నిలిచిపోయింది. తాజాగా సదరు కూటమి నాయకుడు కన్ను మరోసారి అదే చెరువుపై పడింది. అప్పట్లో ఈ చెరువు వివాదాస్పదం కావడం, గ్రామస్తులు కోర్టులో సైతం కేసులు వేయడంతో జిల్లా యంత్రాంగం సైతం ఇది చెరువేనంటూ నిర్ధారించారు.

రెండోసారి కబ్జాకు యత్నం..

ఇదే చెరువు స్థలంలో రెండు రోజుల క్రితం సాగునీటి కాలువల్లోని మట్టిని తీసుకొచ్చి చెరువులోని మిగిలిన నీటిని కప్పిస్తూ కూటమి నేత పనులు చేయిస్తున్నాడు. ఇంత వ్యవహారం జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

చెరువు పరిరక్షణపై 2024 ఫిబ్రవరిలో గ్రామస్తులంతా కలిసి కోర్టులో కేసులు వేశాం. అయినప్పటికీ సింగుపురం టీడీపీ మాజీ సర్పంచ్‌ గుండ ఆదిత్యనాయుడు నాలుగు ఎకరాల చెరువు కబ్జాకు పాల్పడుతున్నారు. ఇదివరకూ ప్రభుత్వ చెరువు అంటూ ఏర్పాటు చేసిన బోర్డులు సైతం పీకిపారేశారు. రెండు రోజులుగా కాలువల్లో మట్టిని తీసుకొచ్చి చెరువులో నీటితో మిగిలిన భాగాన్ని కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

– బగ్గు అప్పారావు, ఎంపీటీసీ, సింగుపురం

సింగుపురం మేజర్‌ పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలం కనిపిస్తే కూటమి నేతలు పాగా వేసేందుకు సిద్ధపడుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డు లేకుండాపోతోంది. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలు అరికట్టాలి.

– బాణ నర్సింగరావు, సింగుపురం

సింగుపురంలో చెరువు కబ్జా జరుగుతుందన్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. ప్రభుత్వ చెరువులు, డీ పట్టా భూములు, కాలువలు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– ఎస్‌.గణపతి,

శ్రీకాకుళం మండల తహశీల్దార్‌

సింగుపురంలో కోట్లు విలువైన చెరువు కబ్జాకు కూటమి నేత ఎత్తుగడ

కోర్టులో కేసు ఉండగానే మరోసారి ఆక్రమణకు యత్నం

పట్టించుకోని అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement