ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో పాఠాలను గణనీయంగా తగ్గించిన విద్యాశాఖ.. సాంఘికశాస్త్రానికి వచ్చేసరికి గుట్టలు, గుట్టలుగా చాప్టర్లు పెంచిందన్న విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్‌లో భౌతికశాస్త్రంలో 4, రసాయన శాస్త్రంలో 4, జీవశాస్త్రంలో 5 మొత్తం కలిపి 13 పాఠాలు ఉండగా వీటిని వేర్వేలు ఉపాధ్యాయులు బోధించే అవకాశం ఉంది. గణితం 15 అధ్యాయాలు కాగా భాషా సబ్జెక్టులు 10 నుంచి 14 యూనిట్లకు పరిమితం చేశారు. సాంఘికశాస్త్రంలో మాత్రం 22 పాఠాలు ఉండగా వీటిని ఒక్క ఉపాధ్యాయుడే బోధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిలబస్‌ను కుదించాలని ఏపీఎస్‌ఎస్‌టీఎఫ్ ఫోరం ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది.
నందిగాం: రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఇటీవల రూపకల్పన చేసిన సిలబస్‌లోని అసమానతలు విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మార్చారు. 9,10 తరగతులకు గతేడాది సిలబస్‌నే నిర్దేశించినా, సాంఘిక శాస్త్రం సిలబస్‌ను హేతుబద్ధీకరించి భారాన్ని తగ్గిస్తామని గతంలో విద్యాశాఖాధికారులు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరు నుంచి పది తరగతుల వరకు అమలు చేస్తున్న సాంఘికశాస్త్రం సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అధికంగా ఉంది. దీంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, నేర్చుకునే విద్యార్థి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
6 నుంచి 8వ తరగతి వరకు యథాతథంగా సీబీఎస్‌సీ సిలబస్‌ను పోలి ఉంటూ వాటికి అదనంగా ప్రాంతీయ అంశాలు ఒక చాప్టర్, ఏఐ ఒక చాప్టర్ జత చేసి రెండు సెమిస్టర్లుగా మార్చారు. 9, 10 తరగతుల పాఠ్యాంశాలు పూర్తిగా సీబీఎస్‌సీ సిలబస్‌నే రాష్ట్ర సిలబస్‌గా పొందుపర్చారు. వీటిలో 6 నుంచి 9 వతరగతి వరకు సెమిస్టర్–1, సెమిస్టర్–2గా విభజించి వాటిలోనే భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధశాస్త్రం వంటి విభిన్న అంశాలు పొందుపర్చగా, పదో తరతిలో సెమిస్టర్ విధానం లేకుండా పాత పద్ధతిలోనే ఈ నాలుగు విభాగాలు పొందిపరిచారు.
సవాల్‌గా మారిన భోదన..
నేటి విద్యావిధానంలో విద్యార్థుల నిరంతర సమగ్ర మూల్యాంకనం, ప్రాజెక్టుల తయారీ, ఇతర అకడమిక్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఉపాధ్యాయులకు 22 పాఠాల విస్తృత సిలబస్‌ను అధికారులు చెప్పినట్లు డిసెంబర్ నాటికి పూర్తి చేయడం సవాల్‌గా మారింది. నిర్ణీత సమయంలో బోధించడం, రివిజన్ చేయించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర సబ్జెక్టులతో పోల్చితే సిలబస్ ఎంతో అధికం
ఉపాధ్యాయులు, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి
సిలబస్ తగ్గించాలని ఏపీఎస్‌ఎస్‌టీఎఫ్ ఫోరం వినతి


