అరసవల్లి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు సజావుగా జరిగేలా ఏర్పాటు చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 దర్శన టికెట్ల భక్తులకు అంతరాలయ దర్శనం చేయించారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఫ్యాన్లు పని చేయకపోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. మరోవైపు, క్యూలైన్లలో సెల్‌ఫోన్లు చెకింగ్ పాయింట్ల వద్ద గంటల తరబడి వేచివుండడంతో దర్శనాలు ఆలస్యం కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశఖండన శాల, మరుగుదొడ్లు, కొబ్బరి కాయలు కొట్టిన చోట అదనపు వసూళ్లు జరిగాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకే పాయింట్ వద్ద చెప్పుల కలెక్షన్ ఉండటంతో భక్తులకు పాట్లు తప్పలేదు.
ఆదిత్యుని సన్నిధిలో అసోం చీఫ్ సెక్రటరీ..
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని జిల్లాకు చెందిన అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోత రవి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.


