శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాదులను అసభ్య పదజాలంతో, న్యాయవాద వృత్తిని కించపరిచేలా మాట్లాడం సరికాదని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధికార పార్టీ దురహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మేధావి వర్గానికి చెందిన న్యాయవాదులనే ఇంత దారుణమైన పదజాలంతో, బహిరంగంగా కించపరిచి మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. న్యాయవాదులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతుల కోరిక మేరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వారి బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన వారిపై ప్రత్యక్ష దాడులు చెయ్యించడం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.


