వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అమరావతిలో జరుగుతున్న అవినీతి, అప్పులు, భూములు ఇవ్వని రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వేధిస్తోందో వైఎస్సార్‌సీపీ ప్రపంచానికి చెబుతోందనే అక్కసుతోనే పార్టీ నేతలపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు సైతం గాయాలయ్యాయని తెలిపారు. శ్రీకాకుళంలోని టౌన్‌హాల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఒకటి రెండు చోట్ల పోలీసులే ఈ దాడిని కో ఆర్డినేట్ చేయడం, అధికార పార్టీ అరాచకాలకు కవచంలా నిలవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆగ్ర హం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకే రాజకీయ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించే భవనాలకు చదరపు అడుగుకు సుమారు రూ. 5,587 ఖర్చవుతుంటే, చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ. 20,439 ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ. 47,385 కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను గాలికొదిలేశారని విమర్శించారు. పెనుమాక తదితర గ్రామాల్లో భూ ములివ్వని రైతుల పొలాలను ముంచేస్తూ, సాగు చేసుకోనివ్వకుండా మట్టి దందాలు, ఇసుక దోపిడీలకు తెగబడటం సరికాదన్నారు. రైతు భూమి మీద కన్నేసి, రైతు గొంతు కోసేయడం చంద్రబాబు దుర్మార్గ పాలనకు ప్రతీక అని అన్నారు. టీడీపీకి అమరావతి అంటే ప్రజల రాజధాని కాదు, కాంట్రాక్టర్ల దోపిడీ రాజధాని అని మండిపడ్డారు. రైతులను మోసం చేసి, భయపెట్టిన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ బాధితులైన అమరావతి రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, రాష్ట్ర పొందర కూరాకుల బీసీ విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, ఎస్‌ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కిల్లి అజయ్, కనపల అరవింద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి మండలం రాధావల్లభపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కృష్ణదాస్, తిలక్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.


