●నౌపడ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి నిరసన
సంతబొమ్మాళి: అసలే ఎండలు మండిపోతున్న వేళ.. ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధించడంతో నౌపడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు మండిపడుతూ సబ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఫోన్ చేసినా లైన్‌మెన్ స్పందించడం లేదని, అసలు విద్యుత్ సరఫరా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తూ నౌపడ విద్యుత్ సబ్‌స్టేషన్ కు చేరుకొని సిబ్బందిని ప్రశ్నించారు. ఈఎల్‌ఆర్ అంటూ టెక్కలిలో కరెంట్ తీశారని సిబ్బంది సమాధానమిచ్చారు. రొయ్యల చెరువులకు విద్యుత్ సరఫరా ఎలా ఉంది. మాకెందుకు కట్ చేశారని జనాలు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సబ్ స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ నుంచి విద్యు త్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.
కరెంటు కోసం గొడవ చేస్తారా..
సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కరెంట్ సమస్య ఉంటే పగలు చెప్పుకోవాలని రాత్రిపూట ఏమిటని తిరిగి జనాలపై మండిపడ్డారు. ప్రతి రోజు రాత్రి పూట కరెంటును తీసివేస్తున్నారని జనాలు చెప్పగా.. అలాగైతే సోలార్, ఇన్వెర్టర్ ఏర్పాటు చేసుకోవాలని, కరెంటు కోసం గొడవ చేస్తారా అంటూ పోలీసులు ఆగ్రహించారు. గంటకు పైగా ఇరువురి మధ్య వాగ్వాదం జరగడం ఆ తర్వాత కరెంటు రావడంతో అందరూ వెనుదిరిగారు.


