● ప్రాజెక్టు ఆధునీకరణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
● నేడు ‘పైడిగాం పోదాం పదండి’ కార్యక్రమం
● విజయవంతం చేయాలని పిలుపు
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు హయాంలో గానీ.. మూడుసార్లు స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన బెందాళం అశోక్ హయాంలో గానీ పైడిగాం ప్రాజెక్టు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ ప్రాంత రైతులపై కూటమి పాలకులకు ఎటువంటి ప్రేమ ఉందో దీని ప్రకారం తెలుసుకోవచ్చు. ఇప్పటికై నా పైడిగాం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలి.
– సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి,
నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న పైడిగాం పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రాజెక్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో, వైఎస్సార్‌సీపీ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. టీడీపీ హయాంలో రైతులకు న్యాయం జరగలేదు. ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం స్పందించి ఆధునీకరణ పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి.
– డాక్టర్ నిమ్మన దాస్, ఎంపీపీ, సోంపేట
సోంపేట: మండలంలోని చిన్ననీటి ప్రాజెక్టు అయిన పైడిగాం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి, పంటలకు సకాలంలో సాగునీరు అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘పైడిగాం పోదాం పదండి’ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టనున్నారు. రైతులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతో పోరు చేపడుతున్నట్లు ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే పైడిగాం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపడతామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీలు గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ఒక్క పైసా నిధులు కూడా మంజూరు చేయకపోవడం దారుణమని స్థానిక రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు ఆధునీకరణకు నోచుకోకపోవడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాల రైతులకు సకాలంలో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. కంచిలి, సోంపేట, మందస మండలాల పరిధిలోని 67 చెరువులకు సాగునీరు సకాలంలో అందడం లేదు. అదే కాలువలకు పూర్తి రాతి కట్టడం నిర్మిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అందువలన ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చరిత్ర
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1958–63 సంవత్సరాల మధ్య నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అప్పటి సమితి అధ్యక్షుడు గన్ని పద్మనాభం కృషితో పైడిగాం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. సోంపేట, కంచిలి, మందస మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందజేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగా 5 వేల ఎకరాలకు అయినా.. పరోక్షంగా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా జరుగుతుంది. అనంతరం 2014 – 19లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాలువలకు రాతి కట్టడం నిర్మాణం కోసం రూ.14 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో 16.4 కిలోమీటర్ల కాలువలో 6.2 కిలోమీటర్ల కాలువకు రాతికట్టడం పూర్తి చేశారు. అయితే మిగతా కాలువకు రాతికట్డడం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాగా 2018లో తిత్లీ తుఫాన్ ప్రభావంతో పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట ఆనవాలు లేకుండా పోయింది. దీంతో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో రూ.20 లక్షల నిధులు మంజూరు చేసి ఆనకట్ట మరమ్మతులు చేపట్టారు. దీంతో రైతులకు కొంత ఉపశమనం కలిగింది.


