● తీవ్ర ఆవేదనలో విష్ణుచక్రం గ్రామస్తులు
● పోర్టు పునరావాస గ్రామంలో కనీస వసతులు కరువు
● అధికారులకు ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
సంతబొమ్మాళి : పుట్టిన ఊరిని, నివాసమున్న ఇళ్లను వదిలి సర్వం త్యాగం చేసి పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న విష్ణుచక్రం గ్రామస్తులు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూలపేట పోర్టు పునరావాస ప్రాంతమైన విష్ణుచక్రం గ్రామస్తులను 15 నెలల క్రితం నౌపడ పునరావాస కాలనీకి తీసుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి ఐదు సెంట్లు చొప్పున 70 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. అయితే వసతులు కల్పించడం మాత్రం మర్చిపోయారు. వీధి దీపాలు రెండు నెలలుగా వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో విషసర్పాలతో భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. బాగా దిగువకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడట్టడంతో మట్టి పేరుకుపోయింది. డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో దుర్గంధం వెదజల్లి దోమలు, ఈగలకు నిలయంగా మారింది. కుళాయిల ద్వారా ఎప్పుడు నీరు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో మంచినీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు.
గుడి, బడి లేక..
పునరావాస కాలనీకి వచ్చి 15 నెలలు కావస్తున్నా విద్యార్థుల కోసం పాఠశాల ఏర్పాటు చేయలేదు. పాఠశాల లేక చిన్నారులను దూరప్రాంతాలకు పంపుతున్నారు. కమ్యూనిటీ హాల్ కూడా లేదు. విష్ణుచక్రం గ్రామంలోని గుడులన్నీ పునరావాస కాలనీలో పునర్నిర్మిస్తామని చెప్పిన అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. దీంతో చెరువు ఒడ్డున కర్రకు దేవుడి జెండా ఏర్పాటు చేసి ప్రతి రోజు పూజలు చేస్తుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల జూలైలో మరిడమ్మ తల్లి సంబరాలు ఉన్నాయని, ఇక్కడ గుడి నిర్మాణం చేయకపోవడంతో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం విష్ణుచక్రంలో ఉన్న మరిడమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి సంబరాలు జరుపుకోవాల్సి వస్తోందంటున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
త్యాగాలు మర్చిపోయారు..
పోర్టు కోసం మేము చేసిన త్యాగాలను ప్రజాప్రతినిధులు, అధికారులు మరిచిపోయారు. నిర్వాసిత కాలనీలో కనీస వసతులు లేవు. వీధి దీపాలు నెలల తరబడి వెలగడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
– గిన్ని దాలప్ప, నిర్వాసితుడు, విష్ణుచక్రం
సంబరాలు ఎలా.. ?
వచ్చే నెలలో మరిడమ్మ తల్లి సబంరాలు జరుగుతాయి. కాలనీలో గుడి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించలేదు. సంబరాలు ఎలా జరుపుకోవాలి. గుడి, బడికి సంబంధించి నెలలు గడిచిన డబ్బులు జమ చేయలేదు.
– గిన్ని బైరాగి, నిర్వాసితుడు, విష్ణుచక్రం


