జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జేష్టమాసం నాలుగో రోజు శనివారం అంకుర్పారణ, హోమం, పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు చేపట్టారు. దీనికి ముందు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
కూర్మనాథుని సన్నిధిలో సివిల్ జడ్జి
గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని బొబ్బిలి సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ముందుగా గర్భాలయంలో మూలవిరాట్‌ను దర్శించుకొని, అనంతరం లక్ష్మీ సన్నిధి, దుర్గాదేవి, రెండు ధ్వజస్తంభాలు, తాబేళ్ల పార్కును సందర్శించారు. ఆలయ ఈవో టి.వాసుదేవరావు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్చకులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కోటబొమ్మాళిలో
దొంగతనాలు
టెక్కలి రూరల్: కోటబొమ్మాళిలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనాలు జరిగినట్లు స్థానికులు శనివారం గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న పలు దుకాణాల్లో శుక్రవారం అర్ధరాత్రి చోరి జరిగినట్లు సమీప షాపు యజమానులు గుర్తించారు. వారి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి ఇనుప రాడ్డుతో ముఖానికి మాస్క్ పెట్టుకుని చోరీలకి పాల్పడ్డాడు. సమీపంలో ఉన్న మీసేవా కేంద్రంలో చోరీకి పాల్పడి రూ.20 వేల నగదు దొంగలించినట్లు యజమాని ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్కడే ఉన్న చికెన్ సెంటర్‌లో రూ.70 వేలు చోరీకి గురైనట్లు షాపు యజమాని గుర్తించారు. అదేవిధంగా సమీప జిరాక్స్ షాపులో సైతం చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
గుండెపోటుతో
లారీ డ్రైవర్ మృతి
టెక్కలి రూరల్: మండలంలోని వీరరామకృష్ణాపురం వద్దనున్న మద్యం గోడౌన్ వద్ద లారీ డ్రైవర్ చదలవాడ లక్ష్మీ నారాయణ రెడ్డి (63) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రకాశం జిల్లా నికరంపల్లి గ్రామానికి చెందిన ఈయన మద్యం బాటిళ్ల లోడును లారీలో ఎక్కించుకుని టెక్కలి మండలం వీఆర్‌కే పురం వద్దనున్న మద్యం గోడౌన్‌కి వచ్చారు. అనంతరం అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి మృతి చెందినట్లు తెలిపారు.


