అనాథ శవానికి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అనాథ శవానికి అంత్యక్రియలు

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

నందిగాం: మండల పరిధిలోని పాత్రునివలసలో ఉన్న పాత షిర్డీ సాయిబాబా మందిరంలో మృతి చెందిన అనాథ శవానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత్రునివలస జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత షిర్డీ సాయిబాబా మందిరం నుంచి శుక్రవారం సాయంత్రం దుర్వాసన వస్తుండటంతో, ఉపాధి హామీ పనులు చేసి వస్తున్న వేతనదారులు గమనించి లోపలకి వెళ్లి చూశారు. అక్కడ ఒక వ్యక్తి మృతి చెంది ఉండడంతో నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిశీలించి.. గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాల్లో మృతుడు బిచ్చగాడిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించి గ్రామస్తుల సహకారంతో మందిరం ఆవరణలోనే ఖననం చేశారు.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ

ఇచ్ఛాపురం: కంచిలి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న టి.రామారావు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధనరాజుల తులసమ్మ ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న సుమారు 50 ఏళ్ల యాచకుడు ఈనెల 22వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడి బంధువులు వస్తారని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచారు. అయితే 5 రోజులైనా ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కంచిలి ఏఎస్‌ఐ రామారావు యాచకునికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడంతో రూరల్‌ పోలీస్‌లు శవ పంచనామ, పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని అప్పగించారు. దీంతో తన సొంత ఖర్చులతో శనివారం సాయంత్రం బాహుదా నది శ్మశానవాటికలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో యాచకుని మృతదేహానికి అంత్యక్రియలను స్థానికుల సహకారంతో పూర్తి చేశారు. ఈవిధంగా గడచిన 20 ఏళ్లలో 70 అనాథ శవాలకు అంత్యక్రియలు ఏఎస్‌ఐ రామారావు అంత్యక్రియలు నర్విహించారు. కార్యక్రమంలో రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ రాంబాబు, హనుమ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement