హంతకుడిని కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

హంతకుడిని కఠినంగా శిక్షించాలి

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

సోంపేట: మండలంలోని గొల్లఊరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశిని హత్య చేసిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు శనివారం మృతురాలు ఊర్వశి కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఊర్వశిని హత్య చేసిన శివకుమార్‌కు కఠిన శిక్ష విధించాలన్నారు. అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్‌ పిన్నింటి ఈశ్వరరావు, ప్రగతి శీల మహిళా సంఘ ప్రతినిధులు బదకల ఈశ్వరమ్మ, మద్దెల ధర్మారావు, జోగు కోందరాం తదితరులు పాల్గొన్నారు.

అడ్మిషన్‌ ఫీజు రద్దు చేయాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ ఫీజు రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి సోమశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్‌ ఫీజు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల దగ్గర అడ్మిషన్‌ ఫీజు పేరుతో రూ.3 వేలు వసూలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. అడ్మిషన్‌ ఫీజులు కట్టలేక అనేక మంది పేద విద్యార్థులు డ్రాపౌట్స్‌ అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్‌ ఫీజు రద్దుచేసి, ఇప్పటికే వసూలు చేసిన అడ్మిషన్‌ ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రాజు, సాయి, మోహన్‌, పవన్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement