క్రికెటర్లు క్లీన్‌బౌల్డ్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెటర్లు క్లీన్‌బౌల్డ్‌

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

జిల్లా అండర్‌–19 బాలికల ఎంపికల్లో బండారం బట్టబయలు

క్రికెట్‌ సంఘం గేట్‌కు తాళాలు

అవస్థలు పడిన క్రీడాకారులు,

తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి

శ్రీకాకుళం న్యూకాలనీ:

క్రీడాకారులకు బాసటగా నిలవాల్సిన క్రీడా సంఘాలు వారితో ఆటాడుకుంటున్నాయి.క్రికెట్‌ క్రీడాకారుల భవిషత్‌ను ప్రశ్నార్థకం చేస్తూ వ్యవహరిస్తున్నాయి. జిల్లా క్రికెట్‌ సంఘంలో రోజురోజుకూ గొడవలు ముదురుతున్నాయి. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ జిల్లా క్రికెట్‌ సంఘం అన్నంట్టుగా అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

సెలక్షన్స్‌ కోసం వస్తే.. తాళాలు

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం అండర్‌–19 మహిళల సెలక్షన్స్‌, పురుషుల మల్టీడేస్‌ జట్ల సర్టిఫికెట్‌ పరిశీలన నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లా క్రికెట్‌ సంఘం భవనం గేటుకు అదనంగా తాళాలు వేయడంతో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కంగు తిన్నారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 7.30 గంటలకే శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీఏ నియమించిన సెలెక్టర్లు, తాత్కాలిక సమన్వయ కమిటీ సభ్యులు కూడా వచ్చారు. అయితే, కార్యాలయ గేటుకు ముందే తాళాలు ఉండగా, వాటికి అదనంగా డబుల్‌ లాక్‌ వేయడంతో సెలక్షన్‌ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

సుమారు రెండున్నర గంటల పాటు సెలెక్టర్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు గేట్‌ బయటే వేచి చూసినా తాళాలు తీయకపోవడంతో తల్లిదండ్రులు, క్రీడాకారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ జరుగుతున్న తతంగాన్ని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ దృష్టికి కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్లగా, ఆయన వెంటనే గేట్లు తెరవాలని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఉదయం 10 గంటల తర్వాత గేట్లు తెరుచుకోవడంతో సర్టిఫికెట్‌ పరిశీలన, నెట్‌ ప్రాక్టీస్‌ ద్వారా అండర్‌–19 బాలికల జట్టు ఎంపికలు పూర్తి చేసి మమ అనిపించారు.

క్రీడాకారులకు నష్టం తప్పదా..?

ఘటనపై ఏసీఏ తాత్కాలిక సమన్వయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్షన్‌ ప్రక్రియను జిల్లా క్రికెట్‌ సంఘంలో చక్రం తిప్పుతున్న కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోపక్క జిల్లా క్రికెట్‌ సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అటు ఏసీఏతోపాటు ఇటు క్రీడాకారుల తల్లిదండ్రులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలు, సంఘటనల వల్ల ఏసీఏ సెలెక్షన్లలో, అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీల్లో జిల్లా ప్రాతినిధ్యమే కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘కూన’ ఎన్నిక అనంతరం రోజుకో రచ్చ..

జిల్లా క్రికెట్‌ సంఘానికి అధ్యక్షునిగా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎన్నికై నప్పటి నుంచి జిల్లా క్రికెట్‌ సంఘంలో రోజుకో యవ్వారం, పూటకో సంఘటన అన్నట్టుగా అగ్గి రాజుకుంటోంది. కూనపై అక్కసుతో జిల్లాలో కింజరాపు వర్గం ఏసీఏలో కీలక వ్యక్తులతో చేతులు కలిపి తెరవెనక తతంగాలు నడిపిస్తున్నారనే విషయం సైతం చక్కర్లు కొడుతోంది. ఏసీఏ పెద్దలు కేసినేని చిన్ని, సానా సతీష్‌లతో కింజరాపు బాబాయ్‌, అబ్బాయ్‌ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జిల్లా క్రికెట్‌ సంఘంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒకరిద్దరు వల్లే జిల్లా క్రికెట్‌ సంఘం మొత్తం బజారున పడుతోందని క్రీడాకారుల తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీన జరగాల్సిన జిల్లా అండర్‌–19 మల్టీటేస్‌ క్రికెట్‌ జట్టు ఎంపికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందోనన్న మీమాంస సర్వత్రా నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement