● ఓ వృద్ధురాలు, మరో మహిళ నుంచి బంగారు ఆభరణాల చోరీ
వజ్రపుకొత్తూరు: పూండిలో చైన్‌స్నాచర్‌లు హల్‌చల్ సృష్టిస్తున్నారు. వ్యాపార కేంద్రం కావడంతో ఒంటరిగా ఉన్న ఇల్లే లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహిస్తున్నారు. ఎవరూ లేని సమయంలో మహిళలు, వృద్ధుల మెడలోని ఆభరణాలు దోచేస్తున్నారు. దోపిడీకి గురైన వారు అరగంట తర్వాత స్పృహలోకి వస్తున్నారు. పూండిలో గురువారం సాయంత్రం, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. పూండి – పీఎంపురం రహదారిలో నివాసముంటున్న వృద్ధురాలు కోట లక్ష్మీ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి ముందున్న పూలు ఏరుతున్న సమయంలో చైన్‌స్నాచర్‌లు వచ్చి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసు ఎత్తుకుపోయారు. దీంతో ఆమె కుమారుడు కోట తవిటినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం దున్న జగదీశ్వరి అనే మహిళ బార్‌రూం నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె మెడలో సుమారు 4.50 తులాల బంగారం పుస్తెల తాడు తెంచుకుపోయారు. ఈ సమయంలో జగదీశ్వరి కుమార్తె ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి రవికుమార్‌కు ఫోన్ చేసింది. ఆయన ఇంటికి వచ్చి చూసే సరికి బాత్‌రూం వద్ద ఆమె స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. కొంత సేపటి తర్వాత తేరుకుని భర్తకు విషయం చెప్పింది. వెనుక నుంచి ఎవరో తలపై కొట్టడంతో కింద పడిపోయానని, ఆ తర్వాత తనకు ఏం జరిగిందో తెలియదని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. వీరి కుటుంబానికి పూండి బస్టాండ్ రోడ్డులో బంగారం షాపు, ఫ్రూట్, పాన్ షాపు ఉన్నాయి. గత ఏడాది జనవరి 23న రవికుమార్‌కు చెందిన బంగారం షాపులోనే సుమారు రూ.70 లక్షలు విలువైన వెండి బంగారం నగలు చోరికీ గురయ్యాయి. ఇంకా ఆ చోరీ కేసు తేలనే లేదు. ఆ సొత్తు రికవరీ కాకపోగా మళ్లీ సంఘటన జరగడంతో వారు బోరున విలపిస్తున్నారు.
సీసీ ఫుటేజీల పరిశీలన..
వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి.నిహార్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంకా ఫిర్యాదు అందలేదని, ప్రాథమిక సమాచారం మేరకు సీసీ టీవీల ఫుటేజీ, ఘటనా ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.


