శ్రీకాకుళం అర్బన్ : వందేమాతర గేయం స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని గాంధీ మందిర కమిటీ వక్తలు పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల దురాగతాలను ఎదిరించేందుకు వందేమాతరం నినాదం అందరినీ ఏకం చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 188వ జయంతి శుక్రవారం నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్ నిక్కు అప్నన్నతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సురంగి మోహన్‌రావు, ఎం.ప్రసాదరావు, జామి భీమశంకర్, పైడి హరనాధరావు, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మహిబుల్లాఖాన్, పందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్, బుడుమశీరు సూర్యారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


