పారదర్శకత కోసమే..
మార్కెట్ కమిటీల్లో పారదర్శకమైన పాలన అందించేందుకే ఈ పర్మిట్ విధానం అమలు చేయనున్నాం. ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ సులభతరం కానుంది. వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– బి.రవికిరణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ,
శ్రీకాకుళం
హిరమండలం: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు స్థానిక సంస్థల అభివృద్ధి, మౌలిక వసతులకు నిధులు అందేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏఎంసీల ద్వారా ఏటా పశువైద్య శిబిరాలు జరిగేవి. పాడి రైతులకు ఉచితంగా మందులు కూడా అందించేవారు. ఇప్పుడు అవి కూడా నిలిచిపో యాయి. దీనికి తోడు తనిఖీ కేంద్రాలతో పాటు గోదాముల నిర్వహణలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 12 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పొందూరు, హిరమండలం, పాతపట్నం, ఆమదాలవలస, జలుమూరులో ఏఎంసీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆదాయ లక్ష్యం రూ.22.96 కోట్లు కాగా.. ఏప్రిల్, మే నెలలో రూ.2.18 కోట్లు సమకూరింది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్ కమిటీలకు సంబంధించి 11 తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా వ్య వసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, సెస్ వసూ లు, చెక్‌పోస్టుల వద్ద వసూళ్ల ద్వారా ఏఎంసీలకు ఆదాయం సమకూరుతుంది. ఆదాయం వరకూ బాగానే ఉంది. కానీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటు వ్యవసాయ అనుబంధరంగాల వారికి అంతంతమాత్రంగానే ప్రోత్సాహం అన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పటివరకూ మాన్యువల్..
మార్కెట్ కమిటీల్లో సిబ్బంది చేతివాటం నియంత్రించేందుకు జూలై నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పటివరకూ మాన్యువల్ విధానం అమల్లో ఉంది. అక్కడే ఎక్కువగా అవి నీతి జరుగుతోందని గుర్తించారు. అందుకే ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ ఈ–పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాక ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో కూడి న ఈ–పర్మిట్ వస్తుంది. తనిఖీ కేంద్రాల వద్ద దా న్ని స్కాన్ చేయగానే సమగ్ర వివరాలు వస్తాయి. జిల్లాలో ఇప్పటికే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 670 మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
లైసెన్స్ తప్పనిసరి
ప్రతి వ్యాపారి ఈ–ట్రాన్స్‌పోర్టు పర్మిట్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వారికి వ్యక్తిగత లాగిన్, పాస్‌వర్డులు కేటాయిస్తారు. వాటి ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆన్‌లైన్‌లో పర్మిట్ జారీచేస్తారు. బ్యాంకుల ద్వారా సెస్ చెల్లింపులకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈలోపు డబ్బులు చెల్లించకపోతే మాత్రం ప్రక్రియ నిలిచిపోతుంది. తనిఖీ కేంద్రాల వద్ద ట్రేడ్ లైసెన్స్ లేకుండా పంట దిగుబడులు తరలించే వ్యాపారుల నుంచి నాన్ ట్రేడర్స్ లైసెన్స్ కింద సెస్ వసూలు చేస్తారు. అయితే అలా మూడుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈలోగా సదరు వ్యాపారితో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయిస్తారు. మూడుసార్లు దాటితే మాత్రం సరుకు విలువ బట్టి జరిమానా కూడా వసూలు చేస్తారు.
జూలై నుంచి ఈ–పర్మిట్ విధానం
చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే
పారదర్శకత కోసమే అంటున్న అధికారులు
వ్యాపారులు వినియోగించుకోవాలని విన్నపం


