అరసవల్లి గోశాలలో రెండు ఆవులు మృతి | - | Sakshi
Sakshi News home page

అరసవల్లి గోశాలలో రెండు ఆవులు మృతి

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

డయారియాతోనే మృతి

ఆలయానికి చెందిన రెండు ఆవులకు డయారియా సోకింది. గురువారం ఉదయం 8 గంటలకు ఆలయం నుంచి ఫోన్‌ సమాచారం రాగానే వెళ్లి చూశాం. శరీర ఉష్ణోగ్రత 101.45 ఫారన్‌హీట్‌ ఉండాలి. కానీ ఒక ఆవుకు 97.5 ఫారన్‌హీట్‌, రెండో ఆవుకు 98.2 ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో పాటు డయారియా తీవ్రంగా ఉండడంతో మృతిచెందాయి. ఫుడ్‌ పాయిజన్‌కు కారణాలు లేకపోలేదు.

– డాక్టర్‌ జి. దిలీప్‌, పశువైద్యుడు, అరసవల్లి

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి గోశాలలో ఉన్న రెండు ఆవులు గురువారం మృతి చెందాయి. ఇందులో ఒకటి సాయంత్రమే మృతి చెందగా.. రెండోది రాత్రి వేళలో కన్ను మూసింది. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. గురువారం ఉదయానికి గోశాలలో ఉండే రెండు ఆవుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానిక పశువైద్యుడు దిలీప్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవుల మృతి విషయం బయటకు పొక్కకుండా ఆలయ అధికారులు గోప్యత పాటించినప్పటికీ.. గురువారం సాయంత్రం ఓ ఆవు కళేబరాన్ని ఖననం చేయడంతో ఒక్కసారిగా సమాచారం దావానంలా వ్యాపించింది. దీంతో హుటాహుటిన ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ఆలయానికి చేరుకుని సంబంధిత విభాగ బా ధ్యులతో చర్చించి తదుపరి చర్యలపై చర్చించినట్లుగా తెలిసింది. అయితే ఒకేసారి రెండు ఆవుల మృతి వెనుక నిర్వహణ లోపమే ప్రధానమని స్పష్టమవుతోంది. గతంలోనూ ఇక్కడ ఓ ఆవు, దూడ మృతి చెందాయి.

ఒకేసారి రెండు ఆవులకు డయారియా

ఆదిత్యాలయం గోశాలలో మొత్తం 13 ఆవులుండగా,ఇందులో గురువారం రెండు ఆవులు మృతిచెందడం సంచలనంగా మారింది. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం వీటికి డయా రియా సోకిందని, అలాగే శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగాతగ్గిపోవడంతో తట్టుకోలేకపోయాయ ని నిర్ధారణకు వచ్చారు. గురువారం ఉదయం రెండు ఆవుల పరిస్థితులను చూసి ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది కూలర్లు పెట్టి మరీ గోశాలలో ఆవులకు సపర్యలు చేయించారు. పశువైద్యుడు దిలీప్‌ ఆధ్వర్యంలో ఆవులకు సైలెన్లు ఎక్కించి మందులు పెట్టారు. అయి నా లాభం లేకపోయింది.

నిర్వహణ లోపమే శాపమా

గోశాల నిర్వహణలో లోపాలున్నాయని, గడ్డి, తవుడు ఆహారం అందిస్తున్న నిర్వహణదారుల నిర్లక్ష్యమే ఆవుల పాలిట శాపాలుగా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. బడ్జెట్‌లో రూ.లక్షలాది రూపాయలు గోశాలకు ఖర్చులు చూపిస్తూ టెండర్లు ఖరారు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారనే చర్చ స్థానికంగా గుప్పుమంటోంది. ఇదిలావుంటే డయారియా అని వైద్యులు నిర్ధారణకు రావడంతో అసలు డయేరియా కు ఫుడ్‌ పాయిజన్‌ కారణమంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుళ్లిన పదార్థాలను ఆహారంగా పెట్టడం, అధికంగా అరటి పళ్లు భుజించడంతో గత ఏడాది ఆవు మృతిచెందిన సంగతి విదితమే. మిగిలిన గోవుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫుడ్‌ పాయిజన్‌ కారణమంటూ చర్చ

గతంలోనూ ఒక ఆవు, దూడ మృతి

డయారియాతో మరణాలు

నిర్ధారించిన పశు వైద్యులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement