నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జరుగుతోందని, దీనిపై వైఎస్సార్‌సీపీకి చెందిన బీఎల్‌ఏలు శ్రద్ధగా దృష్టి పెట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచించారు. ప్రధానంగా ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. పోలాకి మండలం మబగాంలో గురువారం బీఎల్‌ఓ కృష్ణదాస్‌కు ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సర్’ కార్యక్రమంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికీ పూర్తి కాలేదని, తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు కోరారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాకపోతే వాటిని నింపి ఓటరు తిరిగి మళ్లీ ఎప్పుడు బీఎల్‌ఓలకు ఇస్తారు, వాటిని డిజిటలైజేషన్ ఎప్పుడు చేస్తారు అని ఆందోళన వ్యక్తం చేశా రు. బీఎల్‌ఓలకు పలుచోట్ల ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఇలాగైతే సర్‌పై ఎలా దృష్టి పెట్టగలరని ప్రశ్నించారు. ఈ 15 రోజులైనా బీఎల్‌ఓలను ఇతర బాధ్యతల నుంచి తప్పించాలని సూచించారు. నరసన్నపేట నియోజకవర్గంలో మరింత పగడ్బందీగా సర్ కార్యక్రమం నిర్వహించాలని, దీనిపై బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు, నియోజకవర్గ బూత్ కమిటీ అద్యక్షులు సురంగి నర్శింరావులకు సూచించారు.
తరచుగా గ్రామాల్లో పర్యటించి సర్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేసి అర్హత కలిగిన ఓటర్లు అందరికీ ఓటు హక్కు ఉండే విధంగా చూడాలని కోరారు.


