పలాస : ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం సృష్టించడం తగదని, నిర్మాణ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ జూలై 15న పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాసలో బుధవారం వివిధ ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర ప్రాంతాన్ని రక్షించి పర్యావరణాన్ని కాపాడాల్సిన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేటు కంపెనీలకు పచ్చని ఉద్దానాన్ని అప్పగించాలని చూడటం ఇక్కడి ప్రజలను మోసగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా కార్గో ఎయిర్‌పోర్టు కట్టాలనే చిత్త శుద్ధి ఉంటే మూలపేట వద్ద ప్రభుత్వం సేకరించిన భూమి చాలా ఉందని, అక్కడ నిర్మించుకోవాలని కోరారు. సమావేశంలో సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు, తామాడ సన్యాసిరావు, కోనారి మోహనరావు, సీ.హెచ్ రవికుమార్(సి.పి.ఐ), కొమర వాసు, జోగి అప్పారావు, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు, ఎన్.గణపతి, పి.కుసుమ, జుత్తు వీరాస్వామి, జి.బాలకృష్ణ, పి.నాగేశ్వరరావు, కోనేరు రమేస్, ఎం.వినోద్‌కుమార్, ఎస్.వీరాస్వామి, సోమనాధం పాల్గొన్నారు.


