శ్రీకాకుళం అర్బన్:
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వై.అప్పయ్య, కె.దశరథలు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ రెండో రోజైన బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకోవాలని, జీవో నంబర్ 88ని రద్దు చేయాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసీలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు.
కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు జి.త్రినాథరావు కె.బాబురావు, జి.కామేశ్వరరావు, ఎస్వీ రమణ, ఎన్వీఆర్ మూర్తి, పీవీఆర్‌ఎల్ కామేశ్వరి, ఎం.వైకుంఠం, నవీన్, బీఆర్ కృష్ణ, ఎం.ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.


