టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న గోకార్టింగ్ చాంపియన్‌షిప్ సీజన్–3 జాతీయ స్థాయి పోటీలు శనివారంతో ముగిశాయి. ఆంధ్రా, తెలంగాణా, మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుంచి మొత్తం 19 బృందాలు తమ వాహనాలతో ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సీవీ (కంబస్టన్ వెహికల్), ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్ ) విభాగంలో ఫైనల్ రేసింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. సీవీ విభాగంలో మొదటి స్థానంలో ఆదిత్య కళాశాల, రెండో స్థానంలో అనిడ్స్ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈవీ విభాగంలో మొదటి స్థానంలో ఆదిత్య కళాశాల, రెండో స్థానంలో మహారాష్ట్రకు చెందిన ఎస్‌ఎస్‌జీఎమ్‌సీ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ శ్రీరాములు చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు అందజేశారు.


