● 17 మందికి గాయాలు
● నలుగురు పరిస్థితి విషమం
హిరమండలం: పొలాల్లోకి పెళ్లి వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది గాయాలపాలయ్యారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. హిరమండలం మండలం పిండ్రువాడ కాలనీ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం. సోంపేట మండలం శాసనం గ్రామానికి చెందిన పెళ్లి బృందం వ్యాన్‌లో పాత హిరమండలం బయలుదేరింది. సరిగ్గా పిండ్రువాడ కాలనీ సమీపంలో మలుపులో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిసర గ్రామాల ప్రజలు వచ్చి క్షతగాత్రులకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తొలుత హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యంకోసం నలుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


