శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో హిరమండలం ఎత్తిపోతల పథకం, మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం వంటివి వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించి కొన్ని పనులు పూర్తిచేయగలిగామని, తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా వదిలేయడం దారుణమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. మూలపేట పోర్టు నిర్మాణ పనులు దాదాపుగా 80 శాతం వైఎస్సార్‌సీపీ హాయాంలోనే పూర్తి చేశామని, రెండేళ్లు గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయకపోవడం తగదన్నారు. ప్రజా సమస్యలు, జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల పూర్తిచేసే విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా అడుగులు వేసేందుకు సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులున్నా పనులు పూర్తిచేసేందుకు ఒక్క అడుగు ముందుకు వెయ్యకపోవడం దారుణమన్నారు. జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులు అడిగేందుకు చంద్రబాబు ముందు వణికిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి తప్ప మరే ఇతర ప్రాంతాలు అభివృద్ధి అవసరం లేదని, కూటమి నేతలకు కమీషన్లు వచ్చే పనులు తప్ప ఇతర పనులు అవసరం లేదన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అడ్డంకిగా ఉండడంతో అప్పట్లో ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తాను, కృష్ణదాస్ వెళ్లి కొన్ని అడ్డంకులు తొలగించగలిగామన్నారు. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ పాలకులతో అనుబంధం ఉన్న కూటమి నేతలు నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించే దిశగా కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం జిల్లా ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల వద్ద గౌరవం పొందేందుకు ప్రతిపక్షానికి మంచి అవకాశమన్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియాతో పది రోజులుగా వణికిపోతున్నా మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కసారి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. డయేరియాతో 8మంది మృత్యువాత పడితే ఇద్దరినే పరిగణనలోకి తీసుకుని ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం అన్యాయమన్నారు. కుళాయి నీరు కలుషితమైందని అధికారికంగానే ప్రకటించారని, దీనివల్లే దాదాపుగా 250 మందికి పైగా డయేరియాతో ఆస్పత్రి పాలైయ్యారన్నారు. డయేరియాతో ఇబ్బందిపడ్డ, మృత్యువాత పడిన కుటుంబాలకు న్యాయం జరిగేందుకు కార్యాలయం ముట్టడి, చంద్రబాబు కళ్లు తెరిపించేలా వైఎస్సార్‌సీపీ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రానున్న నాలుగు నెలల్లో ప్రజా సమస్యలు, ప్రాజెక్టుల సందర్శనపై అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందని, దీనికి వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీ పరంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన కార్యక్రమాలు చేస్తూనే జిల్లాలో జరిగిన అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలవాలని దిశానిర్ధేశం చేశారు.
పోలీసులకు వినతిపత్రం..
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాలరావు వంటి గొప్ప వ్యక్తులు వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో కృషి చేస్తే దివంగత నేత వైఎస్సార్ ఫేజ్–2, స్టేజ్–2 పనులకు కోట్లాది రూపాయలు వెచ్చించి వెనుకబడ్డ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో పది అడుగులు ముందుకేసి జిల్లాను అభివృద్ధి సరసన నిలిపేందుకు అనేక పనులు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన పనులు, వంశధార ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలని కోరుతూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం నాలుగు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, కేవీజీ సత్యనారాయణ, ఎం.వి.స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, గుమ్మడి రాంబాబు, అంబటి శ్రీనివాసరావు, చల్ల రవికుమార్, గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, చింతాడ వరుణ్, మార్పు ఫృద్వి, ఉలాల దివ్యభారతి, గేదెల పురుషోత్తం, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, రౌతు శంకరరావు, కోణార్క్ శ్రీను, సనపల నారాయణరావు, సాధు వైకుంఠరావు, నర్తు నరేంద్రయాదవ్, శ్రీరామ్మూర్తి, ఊన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులున్నా ఉపయోగం సున్నా
వైఎస్సార్‌సీపీ హయాంలోనే మూలపేట పోర్టు, ఉద్దానం ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్
ప్రజా సమస్యలపై పోరాడేందుకు సన్నద్ధంకండి
పార్టీ శ్రేణులకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ పిలుపు


