9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ దర్శనం | - | Sakshi
Sakshi News home page

9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ దర్శనం

Mar 8 2026 7:38 AM | Updated on Mar 8 2026 7:38 AM

శ్రీకాకుళం కల్చరల్‌ : ఈ నెల 9, 10 తేదీలలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి కిరణ దర్శనం జరగనుందని ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు కిరణ దర్శనం ఉంటుందని వెల్లడించారు.

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు సత్యవరం విద్యార్థులు

నరసన్నపేట: సత్యవరం ఉన్నత పాఠశాలకు చెందిన ఎ.సంజన, కె.ప్రవీణ్‌కుమార్‌లు అండర్‌–13 విభాగంలో రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీడీ జ్యోతీరాణి తెలిపారు. ఆదివారం నుంచి గన్నవరంలో జరిగే ఈ పోటీలకు శ్రీకాకుళం జిల్లా జట్టులో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

ఒక గ్రామం..ఆరుగురు వీఆర్‌ఓలు

పలాస: బొడ్డపాడు పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే చేసేందుకు శనివారం ఏకంగా ఆరుగురు వీఆర్‌ఓలు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఎందుకొచ్చారా అని ఆరా తీస్తే శనివారం సాయంత్రానికల్లా గ్రామంలో ఉన్న ఇళ్ల మొత్తం సర్వే చేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే తహశీల్దారు తమను మామిడిపల్లి పంపించారని వీఆర్‌ఓల సంఘం జిల్లా కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. ఇక్కడ పనిచేసిన వీఆర్‌ఓ సరిగా సర్వే చేయలేదని, ఇంకా 90 ఇళ్లు ఉన్నాయని, అందుకే ఆరుగురిని పంపించారని సర్వే సిబ్బంది చెప్పారు. మామిడిపల్లితో పాటు లొద్దబద్రలోనూ సర్వే పూర్తి కాలేదని, అక్కడ కూడా ఇంకా 40 ఇళ్లు ఉండిపోయాయని, అవి కూడా శనివారం సాయంత్రానికి పూర్తి చేశామని తహశీల్దారు కళ్యాణ చక్రవర్తి చెప్పారు. మొత్తానికి రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడి కారణంగా పూర్తి స్థాయిలో ఏ పనీ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లి పేరిట మోసగించాడని యువతి నిరసన

హిరమండలం: సీఆర్‌పీఎఫ్‌ జవానుతో తనను ప్రేమ పేరుతో వంచించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హిరమండలం మండలంలోని భగీరథపురం కాలనీకి చెందిన ఓ యువతి(21)కి భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన కొట్నాల చంద్రశేఖర్‌తో(మహేష్‌) కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. చంద్రశేఖర్‌ తాతగారిల్లు భగీరథపురం కాలనీకి వచ్చిన సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల చంద్రశేఖర్‌కు సీఆర్‌పీఎఫ్‌ జవాను ఉద్యోగం రావడంతో యువతిని పక్కన పెట్టాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. కానీ వారు పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో శనివారం దళిత సంఘాల మహిళా ప్రతినిధులతో కలిసి గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. తనకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేసింది. తనకు న్యాయం చేయకుండా నిందితుడికి కొమ్ము కాయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement