అపరిశుభ్రం.. అవస్థల మయం..!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కూల్చివేతల విధ్వంసం జరగడంతో నిత్యాన్నదాన పథకం రోడ్డు మీదకొచ్చింది. వంద కోట్ల పథకం వచ్చేస్తుందంటూ యుద్ధ ప్రాతిపదికన నిత్యాన్నదాన మండపం కూల్చివేయడంతో వేలాది మంది భక్తులు అన్నదాన ప్రసాదాలు భుజించడానికి నరకం చూస్తున్నారు. దారుణంగా నేలమీదే ఇసుకలోనే అపరిశుభ్ర వాతావరణంలోనే తింటున్నారు. వడ్డించడం మొదలుకుని తిన్న ప్లేట్లను భక్తులే కడుక్కునే పరిస్థితులు ఆదివారం సాక్షి కెమెరాకు చిక్కాయి. వందల సంఖ్యలో భక్తులు భోజనాలు చేస్తున్నప్పటికీ.. అంతా నేలమీదే తినాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి పర్వదినం ఏడు రోజుల పాటు కోట్లాది రూపాయలతో ఎంతో అట్టహాసంగా చేశామని ప్రకటనలు గుప్పిస్తున్న కూటమి నేతలకు, ఈ నిత్యాన్నదాన పథకం అమలు తీరు ఏర్పాట్లు కంటికి కనిపించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. – అరసవల్లి


