బోర్డు బంగ్లా స్థలంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

బోర్డు బంగ్లా స్థలంపై ప్రత్యేక దృష్టి

Feb 6 2026 8:36 AM | Updated on Feb 6 2026 8:36 AM

బోర్డు బంగ్లా స్థలంపై ప్రత్యేక దృష్టి

బోర్డు బంగ్లా స్థలంపై ప్రత్యేక దృష్టి

ఇప్పటికే స్థల వివాదంపై సమీక్ష చేసిన కలెక్టర్‌

ఎంపీడీఓ ఫిర్యాదుతో విచారణ

ప్రారంభించిన ఎస్సై

నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట నడిబొడ్డున విలువైన బోర్డు బంగ్లా స్థల వివాదంపై అధికారులు దృష్టి పెట్టారు. ఏటా ఎవరో ఒకరు వచ్చి స్థలం తమదంటూ స్వాధీనానికి ప్రయత్నిస్తుండటం తెలిసిందే. దీనిలో భాగంగా గత గురువారం రాత్రి ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు శ్రీకాకుళంకు చెందిన కూటమి నాయకుడి సూచనలతో స్థలం వద్ద పనులు చేపట్టిన తెలిసిందే. దీనిపై విమర్శలు చెలరేగడంతో అధికారులు మేల్కొన్నారు. ఏటా వివాదం జరుగుతుండటంతో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకోవడానికి చర్యలకు ఉపక్రమించారు. ఈ స్థలంపై కూటమి నాయకుల కన్ను ఉందని ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ దశలో ఎంపీడీఓ వెంకటేశ్వరప్రసాద్‌ నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ టి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్‌ వద్దకు వెళ్లి స్థల వివాదం వివరించారు. అక్కడే ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కూడా కలిశారు. దీంతో కలెక్టర్‌, ఎస్పీలు తగిన చర్యలు తీసుకొనేందుకు కింది స్థాయి అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు పాత రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కోర్టు నుంచి వచ్చిన సమాచారం.. ఎవరెవరు దీనిపై కోర్టుకు వెళ్లారు అనే వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు నరసన్నపేట ఎస్సై బి.గణేష్‌ ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు పై ఆమదాలవలసకు చెందిన ముద్దాడ గోవిందరావు తదితరులను గురువారం పిలిచి విచారించారు. తనకు స్పష్టంగా హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నాయని, అధికారులు ఎవరూ ఈ స్థలంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ గోవిందరావు కోర్టు ఆర్డర్లు ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

ముదిరిన వివాదం..

కాగా, గొట్టిపల్లి సర్వే నంబరు 219/బీ1 లో ఉన్న 38 సెంట్ల స్థలం బోర్డు బంగ్లాకు చెందిన స్థలంగా ఉంది. అధికారులు దీనిపై సరైన చర్యలు గతంలో తీసుకోకపోవడంతో ఇప్పుడు వివాదం మరింత ముదిరింది. 2023 అక్టోబరు 21న, డిసెంబర్‌ 16న, 2024 ఫిబ్రవరి 20న ఈ స్థలంపై వివాదం జరిగింది. తాజాగా జనవరి 29న మరోసారి వివాదం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement