ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

Feb 6 2026 8:36 AM | Updated on Feb 6 2026 8:36 AM

ఏకలవ్

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

మెళియాపుట్టి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 30 మంది బాలురు, 30 మంది బాలికల సీట్లు భర్తీ చేసేందుకు ఏప్రిల్‌ 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

కోడిగుడ్ల లారీ బోల్తా

ఎచ్చెర్ల : తూర్పుగోదావరి జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ నుంచి పశ్చిమబెంగాల్‌కు కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ గురువారం వేకువజామున ఎచ్చెర్ల సమీపంలోని బైపాస్‌ జాతీయ రహదారిపై బోల్తాపడింది. లారీ ముందు భాగంలోని టైరు పంక్చర్‌ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు పది లక్షల విలువ చేసే గుడ్లు పాడయ్యాయి. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్‌ రోహిత్‌ ఖాజీ, క్లీనర్‌ షేక్‌ రోహిత్‌లు స్వల్పంగా గాయపడ్డారని ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు.

కబళించిన కిడ్నీ వ్యాధి

నరసన్నపేట: తామరాపల్లికి చెందిన కోల చక్రవర్తి(30)ని కిడ్నీ వ్యాధి కబళించింది. ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న చక్రవర్తి కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విధుల్లోకి ఉపాధ్యాయుడు

టెక్కలి: కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు గురువారం ఉపాధ్యాయుడు విధులకు హాజరయ్యారు. ఇదే పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు గత నెల 31న పదవీ విరమణ పొందిన తరువాత కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ అతను విధులకు హాజరుకాలేదు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా...’ అనే కథనం గురువారం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరయ్యారు.

ఆదిత్యుని సన్నిధిలో

పంచాయతీరాజ్‌ కమిషనర్‌

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ వి.ఆర్‌.కృష్ణతేజ గురువారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ డి.సత్యనారాయణ, అర్చకులు ఇప్పిలి రంజిత్‌ శర్మ, సాందీప్‌శర్మ, ఫణీంద్రశర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

గడ్డి కుప్ప దగ్ధం

ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 6వ వార్డు కె.మన్నయ్యపేటలో వరి గడ్డి కుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి కాల్చేశారు. దీంతో బాధితుడు అన్నెపు గోవిందరావు లబోదిబోమంటున్నారు. గత ఏడాది కూడా తన గడ్డి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారని వాపోయారు. శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆచూకీ తెలపండి

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోక్సో, వివిధ సెక్షన్లకు సంబంధించి కేసులో ముద్దాయి ఆమదాలవలస మండలం బొడ్డేపలి గ్రామస్తుడు గొండు సురేష్‌ ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్‌ఐ ఎం.హరికృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా పైకేసులో వాయిదాలకు హాజరుకానందున కోర్టు ప్రోక్లమినేషన్‌ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎవరికై నా తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం  1
1/3

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం  2
2/3

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం  3
3/3

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement