అప్పులు తీర్చేందుకు చోరీలు
శ్రీకాకుళం: అప్పులు తీర్చేందుకు శ్రీకాకుళం రూరల్ మండలం నందగిరిపేటలో జనవరి 30న చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 30న వేకువజామున 5 గంటల సమయంలో నందగిరిపేటలోని పాతిన భూదేవమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. నీరు కావాలని అడిగే క్రమంలో భూదేవమ్మ మెడలోని 32.4 గ్రాముల బంగారు పుస్తెలతాడును తెంచుకుని కారులో పారిపోయారు. ఈ మేరకు బాధితురాలి కుమారుడు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలించారు. గ్రామానికి రాకపోకల సాగించిన కార్లపై దృష్టిపెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను బట్టి కారు నంబరును గుర్తించి యజమాని వివరాలను సేకరించారు. ఆమదాలవలసలోని మెట్టెక్కివలస ప్రాంతానికి చెందిన కారు యజమానిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా తానే మరో ఇద్దరితో కలిసి నేరం చేసినట్లు అంగీకరించారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వారిలో గుంట జగదీశ్వరరావు, గుంట ప్రమీలతోపాటు మెండ వెంకటరమణ ఉన్నారు. వీరి ముగ్గురూ ఆమదాలవలస పట్టణంలోని మెటక్కివలస హడ్కో కాలనీకి చెందినవారు. వీరిలో జగదీశ్వరరావు, ప్రమీల భార్యాభర్తలు కాగా, వెంకటరమణ వీరికి స్నేహితుడు. వీరంతా అప్పుల పాలు కావడంతో వాటిని తీర్చేందుకు దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు. 20 రోజుల పాటు నందగిరిపేటలో రెక్కీ నిర్వహించి ఒకటి రెండు సార్లు విఫలమయ్యారు. వేకువజామున అయితే ఎవరూ ఉండరని భావించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి 32.4 గ్రాముల బంగారం, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వారం రోజుల్లోనే ఛేదించిన శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడపునాయుడు, ఎస్సై కె.రాములను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. సిబ్బందికి నగదు పారితోషకాలను డీఎస్పీ అందజేశారు
ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్
32.4 గ్రాముల బంగారం స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద


