సిబ్బంది లేక..
అవినీతి నిరోధక శాఖ
● అరకొర సిబ్బందితో ఏసీబీ
● డీఎస్పీ సహా సరిపడా సిబ్బంది లేక అవస్థలు
శ్రీకాకుళం క్రైమ్ : అవినీతిని నిరోధించాల్సిన శాఖ.. సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. గత ఏడాది అక్టోబరులో డీఎస్పీ బీవీ రమణమూర్తి విశాఖపట్నం బదిలీ కావడం, విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్పీ రమ్యకు అక్కడితో పాటు ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం, ఆమె విజయనగరానికే ఎక్కువ శాతం పరిమితం కావడంతో జిల్లాలో ఈ శాఖ స్తబ్ధుగా ఉండిపోయింది. 2025 ఏడాదిలో మూడంటే మూడు కేసులు అదీ రమణమూర్తి డీఎస్పీగా ఉన్నప్పుడే కట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అవినీతి పెచ్చుమీరుతున్నా అవినీతి నిరోధక శాఖ నిద్రావస్థలో ఉందన్న విమర్శలు అధికమవ్వడంతో ఈ మధ్య ఏసీబీ దాడులు అధికం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలను మేలుకొలిపి అవినీతిపై ఫిర్యాదులిచ్చేవిధంగా సంబంధిత శాఖ 14400 టోల్‌ఫ్రీ నంబర్‌కు విస్తృతంగా ప్రచారం కల్పించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా వచ్చిన 1064 టోల్‌ఫ్రీ నంబర్ అంత బాగా ప్రాచుర్యంలో లేదు.
సిబ్బంది కొరత..
ఆరుగురు పీసీలు, ఆరుగురు హెచ్‌సీలు, ముగ్గురు ఎస్‌ఐలు, ముగ్గురు సీఐలు, ఓ రెగ్యులర్ డీఎస్పీ జిల్లా ఏసీబీలో ఉండాలి. దాదాపు 8 ఏళ్లు డీఎస్పీగా కొనసాగిన రమణమూర్తి గత ఏడాది అక్టోబరులో విశాఖపట్నానికి బదిలీ కావడం, రెగ్యులర్ డీఎస్పీ లేకుండా ఇన్‌చార్జిగా విజయనగరం డీఎస్పీ రమ్యను మన జిల్లాకు నియమించినా ఆమె సరిగా రాకపోవడం చాలా ఇ బ్బందిగా పరిణమిస్తోంది. అంతేకాక సీఐ ఒకరు, ఎస్‌ఐలు ముగ్గురు, పీసీలు ముగ్గురు, హెచ్‌సీ ఒకరు లేకపోవడంతో ఉన్నవారిపైనే పూర్తిగా భారం పడుతోంది. దీనిపై ఈ మధ్య ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా సిబ్బంది కొరత మాట వాస్తవమేనని, రెగ్యులర్ అధికారి వచ్చినంత వరకు ఇబ్బంది ఉంటుందన్నారు. కొత్త ఫోన్ నంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్ల తాలుకా పాంప్లెట్లు, స్టిక్కర్లు వచ్చాయని, ప్రచారం కల్పిస్తామన్నారు
ఈ శాఖలపైనే ఆరోపణలు
● జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఇబ్బడిముబ్బడిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల ను, నిర్ణీత జరిమానా చెల్లించడం ద్వారా చట్టబద్ధం (రెగ్యులరైజ్) చేసే ప్రక్రియ బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్)ను సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, కార్పొరేషన్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి.
● సుడా పరిధిలో ఏవైనా నిర్మాణాలకు, లేఅవుట్‌లకు అనుమతులు కోసం వెళ్తే కాగితాల కోసం తిప్పిస్తారని, చేతులు తడిపితే పని వేగంగా అవుతుందనే ఆరోపణ అంతటా వినిపిస్తోంది.
● తూనికలు కొలతల శాఖ, ఎరువుల కంపెనీల నుంచి వచ్చే కంటైనర్లు, హోల్‌సేల్ ఎరువుల షాపుల్లో అవినీతి పెచ్చుమీరుతోంది.
● పశు సంవర్ధక శాఖపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసు శాఖపై కూడా అక్కడక్కడా ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బంగా రం రికవరీ విషయంలో ఆరోపణలున్నాయి.
ఏదీ ప్రచారం.. ?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ను, జిల్లా అధికారుల నంబర్లను, మెయిల్ అడ్రస్‌ల ను మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనే కాక మారుమూల పల్లెలకు సైతం పాంప్లెట్లు, స్టిక్కర్ల రూపంలో అంటించి విస్తృత ప్రచారం కల్పించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం కొంతమేర నిధులు సైతం వెచ్చించారు. కొత్తగా వచ్చిన టోల్‌ఫ్రీ నంబర్ 1064 ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కారణం, కొత్తగా వచ్చిన పాంప్లెట్లు, స్టిక్కర్లు ఇప్పటికీ స్టోరేజీ రూముల్లో మగ్గుతుండటమే. ఇప్పటికీ ప్రజలు పాత టోల్‌ఫ్రీ నంబర్‌కే ఫోన్ చేస్తుండటం, అది పనిచేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.
సిబ్బంది లేక..
సిబ్బంది లేక..


